YCP : మంగళగిరిలో వైసీపీకి బిగ్ షాక్.. టీడీపీలో చేరనున్న వైసీపీ కీలక నేతలు..?
ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఏపీలో రాజకీయం వేడెక్కింది. మరో రెండు నెలల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరగనున్నాయి.
- Author : Prasad
Date : 26-01-2024 - 8:59 IST
Published By : Hashtagu Telugu Desk
ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఏపీలో రాజకీయం వేడెక్కింది. మరో రెండు నెలల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అధికార వైసీపీ పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేస్తుంది. అయితే టికెట్‌లు రాని వారితో పాటు పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేతలంతా పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీకి భారీ షాక్ తగలనుంది. టీడీపీ నుంచి నారా లోకేష్ పోటీ చేస్తున్న నియోజకవర్గంలో వైసీపీ రోజు రోజుకి బలహీన పడుతుంది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో వైసీపీలో వారంతా ఇతర పార్టీల్లోకి వెళ్తున్నారు. వైసీపీ ఇంఛార్జ్‌గా గంజి చిరంజీవిని నియమించడంతో చాలా మంది నేతలు వైసీపీలో అసంతృప్తిగా ఉన్నారు. తాజాగా మంగళగిరి నియోజకవర్గంలోని దుర్గిరాల మండలంలో ఆ పార్టీ కీలక నేతలు వైసీపీకి గుడ్‌బై చెప్పనున్నారు. ఉండవల్లిలో లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరేందుకు వారంతా సిద్ధమైయ్యారు. నిన్నటి వరకు వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి మంతనాలు జరిపిన చర్చల్లో తమకు జరిగిన అన్యాయంపై నేతలు నిలదీశారు. వైసీపీలో ఉండే ప్రసక్తే లేదని విజయసాయికి సదరు నేతలు తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది.వీరంతా సమావేశమై టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. టీడీపీలో చేరే వారిలో దుగ్గిరాల మాజీ జెడ్పీటీసీ, మాజీ జిల్లా మహిళ అధ్యుక్షురాలు యేళ్ళ జయలక్ష్మి, దుగ్గిరాల మార్కెట్ యార్డ్ మాజీ ఛైర్మన్ పాటిబండ్ల కృష్ణప్రసాద్, యడ్ల వెంకటరావులతో పాటు పలు గ్రామాల సర్పంచ్ లు, ముఖ్య నేతలు ఉన్నారు. వీరంతా పార్టీని వీడటంతో మంగళగిరి వైసీపీలో కలవరం మొదలైంది. విజయసాయిరెడ్డి నచ్చచెప్పిన వ్యవహారం కొలిక్కిరాకపోవడంతో వైసీపీ నేతలు తలలుపట్టకుంటున్నారు. దుగ్గిరాల మండలంతో పాటు మంగళగిరి, తాడేపల్లి మండలాలపై ఈ వలసలు ప్రభావం పడే అవకాశాలు మొండిగా ఉన్నాయి.