AP Budget 2022: నేటి నుంచే ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. పక్కా ప్లాన్‌తో వస్తున్న టీడీపీ..!
- Author : HashtagU Desk
Date : 07-03-2022 - 11:27 IST
Published By : Hashtagu Telugu Desk
ఆంధ్రప్రదేశ్‌లో ఈరోజు నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఈ క్రమంలో ఏపీ శాసన మండలితోపాటు, శాసనసభ 2022-23 బడ్జెట్ సమావేశాలు రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగంతో నేటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇక ఏపీ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించాక తొలిసారి విశ్వభూషణ్ హరిచందన్ నేరుగా ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించేందుకు శాసనసభలో అడుగుపెడుతున్నారు.
బీఏసీ సమావేశం ముగిసిన వెంటనే ఏపీ సచివాలయంలో మంత్రి వర్గ సమావేశం నిర్వహిస్తారని సమాచారం. శాసనసభ, మండలిలో ప్రవేశపెట్టనున్న బిల్లుల గురించి చర్చించి కేబినెట్ ఆమోదం తెలపనున్నారు. జిల్లాల పునర్ వ్యవస్థీకరణతోపాటు మరిన్ని అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. పరిశ్రమలు, ఐటీ శాఖ దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అకాల మృతికి సంతాపం తెలుపుతూ మంగళవారం ఉభయ సభల్లో తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మరణించినప్పుడు సంతాపం తెలిపిన తర్వాత సంప్రదాయం ప్రకారం ఉభయ సభలు బుధవారానికి వాయిదా పడతాయి.
ఇక ఏపీలో ఈ సారి అసెంబ్లీ సమావేశాలు కీలకం కానున్నాయి. ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించి పలు కీలక అంశాలు ఈ అసెంబ్లీ సమావేశాల్లో చర్చకు రానున్నాయి. ముఖ్యంగా మూడు రాజధానుల అంశం, సీఆర్డీఏ రద్దు అంశాలపై ఏపీ హైకోర్టు ప్రభుత్వానికి పూర్తి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజా అసెంబ్లీ సమావేశాల్లో అమరావతిపై ఎలాంటి ప్రకటన చేస్తారనే సర్వత్రా, ఉత్కంఠతతో పాటు ఆసక్తి నెలకొని ఉంది. అలాగే కొత్త జిల్లాలపై కూడా తీవ్రంగా విమర్శలు వస్తున్న నేపధ్యంలో, జగన్ ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుందనే అంశం కూడా ఆసక్తిగా మారింది.
ఇక ఇవన్నీ పక్కన పెడితే, అసలే ఏపీ ఆర్థిక పరిస్థితి దారుణంగా దిగజారిపోయిన క్రమంలో, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి లెక్కలు ఎలా చెబుతారన్నది అత్యంత ఆసక్తికరంగా మారింది. ఇకపోతే మరోవైపు అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఈరోజు ఉదయం టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన నివాసంలో టీడీపీ నేతలు భేటీ అయ్యారు. ఈ క్రమంలో ప్రజా సమస్యలపై చర్చ కోసం సభకు హాజరవ్వాలని మెజారిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. దీంతో చంద్రబాబు మినహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తాజా అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానున్నారు. ప్రభుత్వ విధానాలకు నిరసన తెలుపుతూ అసెంబ్లీ ప్రాంగణానికి వెళ్లి టీడీపీ ఎమ్మెల్యేలు నిరసన తెలియజేయనున్నారని సమాచారం. అలాగే టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఏ విధంగా ముందుకు వెళ్లాలనేది చంద్రబాబు ఇప్పటికే టీడీపీ నేతలకు దిశానిర్దేశం చేశారని సమాచారం.