AI Curriculum: ఇకపై హైస్కూల్ స్థాయి నుంచే ఏఐ పాఠ్యాంశాలు: మంత్రి లోకేష్
పాలనలో ఏఐ వినియోగం ద్వారా అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయని మంత్రి లోకేష్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఏఐ సాంకేతికతను ఉపయోగించి విద్య, వైద్యం, ఆరోగ్య రంగాల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
- By Gopichand Published Date - 04:28 PM, Wed - 22 October 25

AI Curriculum: విద్యారంగ సంస్కరణల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఉందని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో క్వీన్స్‌ల్యాండ్ ట్రేడ్ & ఇన్వెస్టిమెంట్ సెంటర్‌లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అంతర్జాతీయంగా అధునాతన సాంకేతికతలలో (AI Curriculum) వస్తున్న మార్పులకు అనుగుణంగా ఏపీలోని విద్యార్థులను సిద్ధం చేయడమే తమ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.
హైస్కూల్ నుంచే ఏఐ విద్య
ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విప్లవం ద్వారా వస్తున్న అవకాశాలను ఆంధ్రప్రదేశ్ యువత అందిపుచ్చుకునేలా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తోందని మంత్రి లోకేష్ వివరించారు. ఈ ప్రణాళికలో భాగంగా హైస్కూలు స్థాయి నుంచే ఏఐ పాఠ్యాంశాలను ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. ఉన్నత పాఠశాలల్లో ఏఐ ల్యాబ్‌లు, స్టెమ్ (STEM), రోబోటిక్స్ ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రత్యేకంగా ఒక ఏఐ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి లోకేష్ వెల్లడించారు. ఏపీ యువతను భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడం ద్వారా దేశానికి టెక్నాలజీ హబ్‌గా ఏపీని నిలపాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని వివరించారు.
Also Read: Jubilee Hills Bypoll : కేటీఆర్, హరీశ్ రావుతో కేసీఆర్ సమీక్ష
గవర్నెన్స్‌లో ఏఐ వినియోగం
పాలనలో ఏఐ వినియోగం ద్వారా అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయని మంత్రి లోకేష్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఏఐ సాంకేతికతను ఉపయోగించి విద్య, వైద్యం, ఆరోగ్య రంగాల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. దీని ద్వారా పరిపాలనలో పారదర్శకత, సామర్థ్యం పెరుగుతాయని అన్నారు.
ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో విద్యారంగంలోని అంతర్జాతీయ నిపుణులు, ప్రముఖులు పాల్గొన్నారు. వీరిలో భారత కాన్సులేట్ జనరల్ (బ్రిస్బేన్) నీతూ భాగోటియా, క్వీన్స్‌ల్యాండ్ యూనివర్సిటీ డిప్యూటీ వైస్ ఛాన్సలర్ మార్క్ హార్వే, క్వీన్స్‌ల్యాండ్ గ్లోబల్ ఇన్వెస్టిమెంట్ కమిషనర్ మిచైల్ మాథ్యూస్, జేమ్స్ కుక్ యూనివర్సిటీ ప్రొఫెసర్ క్యాల్ జెంజర్ తదితరులు ఉన్నారు.