అమరావతికి మహర్దశ.. ‘గ్లోబల్ క్వాంటం బయో ఫౌండ్రీ’తో వైద్య రంగంలో సరికొత్త విప్లవం!
అమరావతి క్వాంటం వ్యాలీ ఆలోచన కేవలం తొమ్మిది నెలల్లోనే కార్యరూపం దాల్చడం గమనార్హం. దేశంలోనే అత్యంత శక్తివంతమైన 'ఐబీఎం 133 క్యూబిట్ క్వాంటం సిస్టమ్ టూ' ఈ ఏడాది సెప్టెంబర్‌లో అమరావతిలో కొలువుదీరనుంది.
- Author : Gopichand
Date : 20-01-2026 - 8:18 IST
Published By : Hashtagu Telugu Desk
Amaravati: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఇప్పుడు సరికొత్త సాంకేతిక విప్లవానికి వేదిక కాబోతోంది. రాష్ట్రాన్ని క్వాంటం టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంకల్పంతో ‘గ్లోబల్ క్వాంటం బయో ఫౌండ్రీ’ అమరావతి క్వాంటం వ్యాలీ పరిధిలోకి వచ్చింది. క్వాంటం టెక్నాలజీ, బయాలజీ కలయికతో ఏర్పడే ఈ ఫౌండ్రీ, సాంప్రదాయ కంప్యూటర్లకు సాధ్యం కాని ఎన్నో సంక్లిష్ట ఆవిష్కరణలను సుసాధ్యం చేయనుంది. ముఖ్యంగా మొండి వ్యాధులను నయం చేసే సరికొత్త ఔషధాలు, ఎంజైమ్ ఇంజినీరింగ్, అత్యాధునిక చికిత్సా విధానాలు, ఆధునిక వైద్య పరికరాల తయారీలో ఇది కీలక పాత్ర పోషించనుంది.
ఈ బృహత్తర ప్రాజెక్టులో టీసీఎస్, ఐబీఎం, సీఎస్ఐఆర్, ఐఐటీ ఢిల్లీ, సీవీజే సెంటర్, సెంటెల్లా ఏఐ వంటి ప్రపంచ స్థాయి దిగ్గజ సంస్థలు భాగస్వాములుగా ఉండటం విశేషం. దీనివల్ల రాష్ట్రానికి భారీగా విదేశీ పెట్టుబడులతో పాటు అత్యంత విలువైన హై-వాల్యూ ఉద్యోగాలు, పరిశోధన ఆధారిత స్టార్టప్‌లు రానున్నాయి.
Also Read: ఐపీఎల్‌లోకి గూగుల్ ఎంట్రీ.. బీసీసీఐకి భారీ లాభం?!
అమరావతి క్వాంటం వ్యాలీ ఆలోచన కేవలం తొమ్మిది నెలల్లోనే కార్యరూపం దాల్చడం గమనార్హం. దేశంలోనే అత్యంత శక్తివంతమైన ‘ఐబీఎం 133 క్యూబిట్ క్వాంటం సిస్టమ్ టూ’ ఈ ఏడాది సెప్టెంబర్‌లో అమరావతిలో కొలువుదీరనుంది. ఇప్పటికే దేశంలోనే తొలి క్వాంటం పాలసీని అమలు చేసిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రికార్డు సృష్టించగా, ఏప్రిల్ 26 నుంచి భారత తొలి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి.
సుమారు లక్ష మంది యువతకు ఈ రంగంలో శిక్షణ ఇవ్వడం, 20 వేల మంది విద్యార్థులు హ్యాకథాన్లలో పాల్గొనడం, వెయ్యికి పైగా శిక్షణ పొందిన ఫ్యాకల్టీ సిద్ధంగా ఉండటం ఏపీ భవిష్యత్తుకు శుభసూచకం. ఈ మౌలిక సదుపాయాల కల్పనతో హెల్త్‌కేర్, బయోటెక్, డీప్‌టెక్ స్టార్టప్‌లకు అమరావతి ఒక ప్రపంచ స్థాయి కేంద్రంగా అవతరించబోతోంది.