Cancer Prevention: క్యాన్సర్ నిరోధానికి ముందడుగు.. ఏపీకి రూ. 48 కోట్ల విలువైన రేడియేషన్ పరికరాలు!
ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌లో క్యాన్సర్ వ్యాధిపై పోరాటంలో సహకారంగా ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC) నుండి కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) నిధుల ద్వారా మూడు రేడియేషన్ మిషన్లను సమకూర్చే అంశంపై చర్చ జరిగింది.
- By Gopichand Published Date - 02:44 PM, Wed - 23 July 25

Cancer Prevention: క్యాన్సర్ వ్యాధి నివారణ, చికిత్సలో (Cancer Prevention) ఆంధ్రప్రదేశ్‌కు ఒక కీలక ముందడుగు పడింది. కేంద్ర సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్, రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ఈరోజు (జూలై 23) న్యూఢిల్లీలో కేంద్ర చమురు, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరిని కలిశారు.
రూ. 48 కోట్ల విరాళం
ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌లో క్యాన్సర్ వ్యాధిపై పోరాటంలో సహకారంగా ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC) నుండి కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) నిధుల ద్వారా మూడు రేడియేషన్ మిషన్లను సమకూర్చే అంశంపై చర్చ జరిగింది. దీనికి ONGC అంగీకరించింది. ఒక్కొక్కటి సుమారు రూ. 16 కోట్లు విలువ చేసే ఈ పరికరాలు మొత్తం రూ. 48 కోట్లు విలువ చేస్తాయి.
Also Read: Vice-Presidential Election: ఉపరాష్ట్రపతి ఎన్నికలపై బిగ్ అప్డేట్ ఇచ్చిన ఈసీ!
ఎక్కడ ఏర్పాటు చేస్తారు?
ఈ అత్యాధునిక రేడియేషన్ యంత్రాలను త్వరలో కాకినాడ, గుంటూరు, కడప జిల్లాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేయనున్నారు. ఈ పరికరాలు క్యాన్సర్‌ను ప్రారంభ దశలో గుర్తించడంలో అలాగే రేడియేషన్ చికిత్స అందించడంలో కీలకంగా పనిచేస్తాయి.
సానా సతీష్ బాబు కృతజ్ఞతలు
ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు మాట్లాడుతూ.. “ఇది కేవలం సాంకేతిక సహాయం కాదు… ప్రజల ప్రాణాల కోసం నిలిచే ఆశ. క్యాన్సర్‌పై పోరాటానికి కేంద్ర మంత్రుల సహకారం మాకు బలాన్ని ఇస్తోంది. ONGC యాజమాన్యానికి, కేంద్ర మంత్రులు హర్దీప్ సింగ్ పూరి, డా. పెమ్మసాని చంద్రశేఖర్‌లకు హృదయపూర్వక కృతజ్ఞతలు” అని తెలిపారు. ఈ చొరవ ఆంధ్రప్రదేశ్‌లో క్యాన్సర్ చికిత్స సౌకర్యాలను గణనీయంగా మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు.