Lokesh: తన పెళ్లికి రావాలని లోకేష్‌కు ఓ మహిళా అభిమాని ఆహ్వానం.. కట్ చేస్తే!
యువగళం యాత్ర ద్వారా లోకేష్ అభిమానిగా మారిన భవ్య.. తన పెళ్లికి విచ్చేసి ఆశీర్వదించాలంటూ ఇటీవల మంత్రి నారా లోకేష్ కు ఆహ్వానపత్రిక పంపించారు. శనివారం రాత్రి గన్నవరం ఎయిర్ పోర్టు సమీపంలోని ఓ కళ్యాణ మండపంలో భవ్య వివాహం జరగనుంది.
- By Gopichand Published Date - 05:10 PM, Sat - 4 October 25

Lokesh: తాను ఎంతటిస్థాయిలో ఉన్నా అభిమానులు, పార్టీ కార్యకర్తల కోసం ఎందాకైనా వెళ్లే నైజం యువనేత నారా లోకేష్ (Lokesh) సొంతం. లోకేష్ లోని ఆ విలక్షణమైన వ్యక్తిత్వమే లక్షలాదిమంది యువతను ఆయనకు అభిమానులుగా మార్చింది. తమ పెళ్లికి రావాలని ఓ మహిళా అభిమాని పంపిన ఆహ్వానాన్ని మన్నించిన లోకేష్ శనివారం అకస్మాత్తుగా వారి ఇంట ప్రత్యక్షం కావడంతో ఆ అభిమాని నోట మాటరాలేదు. యువగళం ద్వారా లక్షలాదిమంది యువతీయువకుల్లో చైతన్యాన్ని రగిల్చి జగన్మోహన్ రెడ్డి అరాచక ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకలించడంలో యువనేత నారా లోకేష్ పాదయాత్ర కీలకపాత్ర పోషించింది.
యువగళంలో భాగంగా 2023 ఆగస్టు 20వతేదీన యువనేత నారా లోకేష్ విజయవాడ నగరంలో నిర్వహించిన పాదయాత్రకు నభూతో నభవిష్యత్ అన్న విధంగా ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. ఆరోజు విజయవాడలో లోకేష్ ప్రారంభించిన పాదయాత్ర మరుసటిరోజు (21-8-2023) తెల్లవారుజామున 3.30గంటల వరకు కొనసాగింది. అర్థరాత్రి వేళలో సైతం వేలాదిమంది ప్రజలు రోడ్లవెంట నిలబడి యువనేతకు బ్రహ్మరథం పట్టారు. విజయవాడ మొగల్రాజపురానికి చెందిన భవానీ (భవ్య) అనే యువతి ఆనాటి పాదయాత్రలో ఉత్సాహంగా పాల్గొని సంఘీభావం తెలిపింది.
Also Read: Post Office Scheme: రూ. 12,500 పెట్టుబడితో రూ. 40 లక్షల వరకు సంపాదన.. ఏం చేయాలంటే?
యువగళం యాత్ర ద్వారా లోకేష్ అభిమానిగా మారిన భవ్య.. తన పెళ్లికి విచ్చేసి ఆశీర్వదించాలంటూ ఇటీవల మంత్రి నారా లోకేష్ కు ఆహ్వానపత్రిక పంపించారు. శనివారం రాత్రి గన్నవరం ఎయిర్ పోర్టు సమీపంలోని ఓ కళ్యాణ మండపంలో భవ్య వివాహం జరగనుంది. బిజీ షెడ్యూలు ఉన్నప్పటికీ మంత్రి లోకేష్ శనివారం మధ్యాహ్నం మొగల్రాజపురంలోని తన అభిమాని భవ్య ఇంటికి వెళ్లి ఆమెకు ఆశీర్వచనాలు అందజేశారు. అకస్మాత్తుగా అభిమాన నేత లోకేష్ తమ ఇంటికి రావడంతో భవ్యతోపాటు ఆమె తల్లిదండ్రులు నాగుమోతు రాజా, లక్ష్మి ఆనందంతో పొంగిపోయారు. యువనేత లోకేష్ ను చూసి వారి ఉద్వేగానికి గురయ్యారు.