First Pregnancy Robot: పిల్లలను కనే రోబో.. 9 నెలల్లో డెలివరీ, ధర ఎంతంటే?
ఈ విప్లవాత్మక ఆవిష్కరణ వైద్య శాస్త్రంతో పాటు సామాజికంగా, నైతికంగా, చట్టపరంగా అనేక సవాళ్లను లేవనెత్తుతుంది. రోబోట్‌ల నుండి జన్మించిన శిశువులను సమాజం ఎలా ఆమోదిస్తుందనేది ఒక పెద్ద ప్రశ్న.
- By Gopichand Published Date - 09:41 PM, Sat - 16 August 25

First Pregnancy Robot: సినిమాల్లో చూసినట్టుగా రోబోట్‌లు (First Pregnancy Robot) మనుషుల లాగే గర్భం దాల్చి, శిశువులకు జన్మనిచ్చే రోజులు దగ్గరపడ్డాయి. కృత్రిమ మేధస్సు (AI), రోబోటిక్స్ రంగాలలో ఇది ఒక విప్లవాత్మక ఆవిష్కరణ. చైనాలోని శాస్త్రవేత్తలు ఒక గర్భధారణ హ్యూమనాయిడ్ రోబోట్‌ను అభివృద్ధి చేస్తున్నారు. ఇది కేవలం శిశువులను కృత్రిమంగా పెంచడమే కాకుండా నిజమైన గర్భధారణ ప్రక్రియను అనుకరించి, తొమ్మిది నెలల పాటు పిండాన్ని మోసి, సురక్షితంగా జన్మనివ్వగల సామర్థ్యం కలిగి ఉంటుంది.
డాక్టర్ జాంగ్ క్విఫెంగ్ నేతృత్వంలో ప్రాజెక్ట్
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును సింగపూర్‌లోని నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్శిటీకి చెందిన శాస్త్రవేత్త డాక్టర్ జాంగ్ క్విఫెంగ్ నేతృత్వంలో చైనాలో అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పటికే అకాల శిశువుల కోసం ఉన్న ఇంక్యుబేటర్లకు భిన్నంగా ఈ హ్యూమనాయిడ్ రోబోట్ గర్భధారణ ప్రారంభం నుండి జన్మ వరకు మొత్తం ప్రక్రియను అనుకరించేలా రూపొందించారు. దీని కడుపులో ఉన్న కృత్రిమ గర్భాశయం, పిండం పెరుగుదలకు అవసరమైన వాతావరణాన్ని కల్పించడానికి యామ్నియోటిక్ ద్రవం (amniotic fluid) తో నిండి ఉంటుంది. పిండానికి అవసరమైన పోషకాలను, సహజ గర్భధారణలో ప్లాసెంటా (placenta) మాదిరిగా ఒక ప్రత్యేక ట్యూబ్ ద్వారా అందిస్తారు.
Also Read: Free Bikes : ఉచిత బైకులు ఇచ్చేందుకు సిద్దమైన ఏపీ సర్కార్
‘బయోబ్యాగ్’ టెక్నాలజీతో స్ఫూర్తి
ఈ కృత్రిమ గర్భాశయ టెక్నాలజీ అనేది పూర్తిగా కొత్త ఆలోచన కాదని డాక్టర్ జాంగ్ తెలిపారు. గతంలో శాస్త్రవేత్తలు ‘బయోబ్యాగ్’ అనే కృత్రిమ గర్భాశయంలో అకాల గొర్రెపిల్లను విజయవంతంగా పెంచారు. ఆ గొర్రెపిల్ల జీవించి, ఆరోగ్యంగా ఉన్ని పెంచుకుని ఈ టెక్నాలజీ సామర్థ్యాన్ని నిరూపించింది. డాక్టర్ జాంగ్ బృందం ఇప్పుడు ఆ టెక్నాలజీని మరింత అభివృద్ధి చేసి, మానవ శిశువులను మోయగల హ్యూమనాయిడ్ రోబోట్‌లకు అనుసంధానిస్తున్నారు.
డాక్టర్ జాంగ్ ప్రకారం.. కృత్రిమ గర్భాశయ టెక్నాలజీ ఇప్పటికే పరిణతి దశకు చేరుకుంది. ఇప్పుడు దాన్ని రోబోట్ కడుపులో అమర్చడం, నిజమైన వ్యక్తి, రోబోట్ మధ్య పరస్పర చర్య ఉండేలా చూడటం మాత్రమే మిగిలి ఉందని ఆయన తెలిపారు. ఈ గర్భధారణ రోబోట్ తొలి నమూనా (ప్రోటోటైప్) వచ్చే ఏడాది నాటికి సిద్ధమవుతుందని అంచనా. దీని అంచనా వ్యయం సుమారు 100,000 యువాన్ (భారతీయ రూపాయలలో సుమారు ₹12.96 లక్షలు).
నైతిక- చట్టపరమైన సవాళ్లు
ఈ విప్లవాత్మక ఆవిష్కరణ వైద్య శాస్త్రంతో పాటు సామాజికంగా, నైతికంగా, చట్టపరంగా అనేక సవాళ్లను లేవనెత్తుతుంది. రోబోట్‌ల నుండి జన్మించిన శిశువులను సమాజం ఎలా ఆమోదిస్తుందనేది ఒక పెద్ద ప్రశ్న. ఈ సమస్యలపై ఇప్పటికే చైనాలోని గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్ అధికారులు, డాక్టర్ జాంగ్ బృందం చర్చలు జరుపుతున్నారు. భవిష్యత్తులో ఇటువంటి జననాలను నియంత్రించడానికి అవసరమైన చట్టాలు, విధానాలను రూపొందిస్తున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే ఇది సంతానోత్పత్తి, కుటుంబం, జననం నిర్వచనాన్నే మార్చగల శక్తిని కలిగి ఉంది.