Iran warning: నరకం చూపిస్తాం.. గల్ఫ్ దేశాలకు ఇరాన్ వార్నింగ్
- Author : Vamsi Chowdary Korata
Date : 14-07-2026 - 10:33 IST
Published By : Hashtagu Telugu Desk
పశ్చిమాసియా లో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న తరుణంలో గల్ఫ్ దేశాలకు ఇరాన్ అత్యంత కఠినమైన హెచ్చరికలు జారీ చేసింది. తమ బద్ధశత్రువైన అమెరికా సైనిక కార్యకలాపాలకు, మిలిటరీ బేస్‌లకు ఏ రకమైన ఆశ్రయం లేదా మద్దతు ఇచ్చినా.. సదరు దేశాలను ఇరాన్ శత్రు దేశాలుగా పరిగణిస్తుందని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ స్పష్టం చేసింది. అమెరికా సైన్యానికి సహకరించడాన్ని నేరుగా “ఇరాన్‌పై యుద్ధం ప్రకటన” గానే తాము భావిస్తామని పేర్కొంది. తమ సరిహద్దు దేశాలు లేదా గల్ఫ్ రీజియన్‌లోని ఏ చిన్న దేశమైనా సరే, యూఎస్ ఆర్మీకి లాజిస్టిక్, ఇంటెలిజెన్స్ లేదా ఇతర ఏ రూపంలో సహాయం చేసినా ఊరుకునేది లేదని తేల్చి చెప్పింది.
ఒకవేళ ఈ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ అమెరికాకు ఏ దేశమైనా సహకరిస్తే, ఆయా దేశాల భూభాగాలపై నేరుగా క్షిపణి దాడులు చేస్తామని ఇరాన్ సైనిక దళం హెచ్చరించింది. దీంతో పాటు అంతర్జాతీయ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన ‘హార్ముజ్ జలసంధి’ పై అమెరికా ఆధిపత్యాన్ని లేదా నియంత్రణను తాము ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని ఐఆర్‌జీసీ స్పష్టం చేసింది. ఈ ప్రాంతంలో వాణిజ్య నౌకల రాకపోకలపై తమకు పూర్తి పట్టు ఉందని, అమెరికాను ఇక్కడ అడ్డుకోవడానికి వెనకాడబోమని హెచ్చరించింది. ఇరాన్ చేసిన ఈ తాజా ప్రకటనతో గల్ఫ్ రీజియన్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.