Trump Vs Panama : పనామా కాల్వపై నెగ్గిన ట్రంప్ పంతం.. అమెరికా నౌకలకు ఫ్రీ జర్నీ
2024 సంవత్సరం నవంబరులో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్(Trump Vs Panama) ఘన విజయం సాధించారు.
- By Pasha Published Date - 10:37 AM, Thu - 6 February 25

Trump Vs Panama : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎట్టకేలకు తన పంతం నెగ్గించుకున్నారు. ఇక నుంచి ప్రపంచ ప్రఖ్యాత పనామా కెనాల్ మీదుగా అమెరికా యుద్ధ నౌకలు, ఇతరత్రా ప్రభుత్వ నౌకలు ఉచితంగా జర్నీ చేయొచ్చు. ఈమేరకు అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సే, పనామా పబ్లిక్ సెక్యూరిటీ మంత్రి ఫ్రాంక్ అలెక్స్‌కు మధ్య ఒప్పందం జరిగింది. దీనివల్ల అమెరికా ప్రభుత్వానికి భారీగా డబ్బు ఆదా అవుతుంది. ఈవివరాలను అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సె అధికారికంగా ప్రకటించారు. అక్రమ వలసదారులపై పనామా దేశం తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోందని మెచ్చుకున్నారు. ఈ ఒప్పందం విషయాన్ని అమెరికా విదేశాంగశాఖ కూడా ‘ఎక్స్’ వేదికగా ధ్రువీకరించింది.
Also Read :Bhakta Prahlada : ‘భక్త ప్రహ్లాద’కు 93 ఏళ్లు.. రూ.18వేల బడ్జెట్‌తో తీసిన మూవీ విశేషాలివీ
2024 సంవత్సరం నవంబరులో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్(Trump Vs Panama) ఘన విజయం సాధించారు. అప్పటి నుంచే పనామా కాల్వను తిరిగి స్వాధీనం చేసుకుంటామని ట్రంప్ వరుస వార్నింగ్‌లు ఇస్తున్నారు. అవసరమైన తమ ఆర్మీని పనామా కెనాల్‌పైకి పంపుతామని అంటున్నారు.దీంతో ఆందోళనకు గురైన చిన్న దేశం పనామా కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాతో స్నేహమే తమకు మేలు అని స్పష్టం చేసింది. ఈక్రమంలోనే అమెరికాకు చెందిన ప్రభుత్వ నౌకలను ఉచితంగా పనామా కెనాల్ మీదుగా వెళ్లనిస్తామని ప్రకటించింది. అమెరికాకు చెందిన 40 శాతం కంటైనర్లు పనామా కెనాల్ మీదుగా రాకపోకలు సాగిస్తుంటాయి.
Also Read :Valentines Week 2025: ఫిబ్రవరి 7 నుంచి వాలెంటైన్స్ వీక్.. ఏయే రోజు ఏమేం చేస్తారంటే..
పనామా కెనాల్ గురించి..
- అట్లాంటిక్-పసిఫిక్ సముద్రాలను కలుపుతూ 1914 సంవత్సరంలో అమెరికా ప్రభుత్వమే పనామా కాల్వను నిర్మించింది.
- పనామా కెనాల్‌ను తొలుత అమెరికా ప్రభుత్వమే నిర్వహించేది.
- కెనాల్‌ను అమెరికా నిర్వహించడంపై పనామా దేశ ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమైంది. ఘర్షణలు జరిగాయి.
- దీంతో 1977లో నాటి అమెరికా అధ్యక్షుడు జిమ్మీకార్టర్ పనామా కెనాల్‌ను పనామా దేశానికే ఇచ్చేయాలని నిర్ణయించారు.
- అప్పట్లో అమెరికా, పనామా దేశాల మధ్య కెనాల్ అప్పగింత ఒప్పందం జరిగింది.
- పనామా కెనాల్‌ను న్యూట్రల్‌గా నిర్వహించాలని పనామాకు అమెరికా షరతు పెట్టింది. పనామా కెనాల్‌కు ఏ ముప్పు వచ్చినా, దాన్ని రక్షించుకునే హక్కు తమకే ఉంటుందని ఆ ఒప్పందంలో అమెరికా ప్రస్తావించింది.
- ఈ కాల్వ అభివృద్ధికి పనామా ప్రభుత్వం కూడా తదుపరి కాలంలో భారీగాను ఖర్చు చేసింది.
- పనామాలోని ఓడరేవుల్లో చైనా కంపెనీలు పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టాయి.దీన్ని మొదటి నుంచీ ట్రంప్ వ్యతిరేకిస్తున్నారు.