Bhakta Prahlada : ‘భక్త ప్రహ్లాద’కు 93 ఏళ్లు.. రూ.18వేల బడ్జెట్‌తో తీసిన మూవీ విశేషాలివీ
‘భక్త ప్రహ్లాద’(Bhakta Prahlada) సినిమాను కేవలం 18 వేల రూపాయలతో, 18 రోజుల్లో నిర్మించారు.
- By Pasha Published Date - 09:43 AM, Thu - 6 February 25

Bhakta Prahlada : తెలుగు రాష్ట్రాల సినీ ప్రియులకు భక్తి సినిమాలు అంటే చాలా ఇష్టం. భక్తి సినిమాలు తీసే విషయంలో టాలీవుడ్ దేశంలోనే చాలా ఫేమస్. భక్తి సినిమాల్లోని కీలక పాత్రలో అద్భుతంగా నటించిన ఎంతో మంది ప్రముఖ నటులు తదుపరి కాలంలో రాజకీయాల్లోనూ ఒక ఊపు ఊపారు. వారికి అంతరేంజులో అభిమానుల ఫాలోయింగ్ ఉండేది. శ్రీరాముడు, మహా విష్ణువు లాంటి పాత్రల్లో ఎన్‌టీఆర్‌ను తప్ప మరొకరికి నేటికీ తెలుగు ప్రజలు ఊహించుకోలేరు. ఆయా పాత్రల్లో ఆయన అంత అద్భుతంగా నటించారు. నటించారు అనడం కంటే ఆయా పాత్రల్లో జీవించారు అనడమే కరెక్ట్ అవుతుంది. ఇక ‘భక్త ప్రహ్లాద’ సినిమా విడుదలై ఈరోజుతో 93 ఏళ్లు పూర్తయ్యాయి. 1932 ఫిబ్రవరి 6న ఈ మూవీ విడుదలైంది. దాని విశేషాలను టూకీగా తెలుసుకుందాం..
Also Read :Valentines Week 2025: ఫిబ్రవరి 7 నుంచి వాలెంటైన్స్ వీక్.. ఏయే రోజు ఏమేం చేస్తారంటే..
‘భక్త ప్రహ్లాద’ సినిమా విశేషాలివీ..
- ఇవాళ తెలుగు సినిమాకు పండగ రోజు లాంటిది. ఎందుకంటే మొట్టమొదటి పూర్తి నిడివి తెలుగు సినిమా ‘భక్త ప్రహ్లాద’ 93 ఏళ్ల క్రితం ఈ రోజే విడుదలైంది.
- హెచ్.ఎం. రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా వచ్చింది.
- 1931 మార్చి 14న తొలి భారతీయ టాకీ ‘ఆలమ్ ఆరా’ విడుదలైంది.
- ‘ఆలమ్ ఆరా’కు దర్శకత్వ శాఖలో హెచ్.ఎం. రెడ్డి పని చేశారు.
- ‘ఆలమ్ ఆరా’ మూవీ విడుదలైన సరిగ్గా ఏడున్నర నెలల తర్వాత తొలి దక్షిణ భారతీయ భాషా టాకీ ‘కాళిదాస్’ను హెచ్.ఎం. రెడ్డి రూపొందించారు. ముంబై కేంద్రంగా ఈసినిమా చిత్రీకరణ జరిగింది.
- ‘కాళిదాస్’ మూవీ సక్సెస్ కావడంతో.. పూర్తి నిడివి తెలుగు సినిమా తీయాలనే ఆలోచన హెచ్.ఎం. రెడ్డికి వచ్చింది.
- హెచ్.ఎం. రెడ్డి దర్శకత్వంలో 10 రీళ్ళ తెలుగు టాకీగా ‘భక్త ప్రహ్లాద’ సినిమా తయారైంది. ఈ సినిమా నిర్మాణం, సెన్సారింగ్, తొలి విడుదల కూడా ముంబైలోనే జరిగాయి.
- ‘భక్త ప్రహ్లాద’(Bhakta Prahlada) సినిమాను కేవలం 18 వేల రూపాయలతో, 18 రోజుల్లో నిర్మించారు.
- ధర్మవరం రామకృష్ణమాచార్యుల నాటకం ఆధారంగా, సురభి నాటక సంస్థ నటీనటులతోనే ఎక్కువ వేషాలు వేయించి భక్త ప్రహ్లాద సినిమా తీశారు.
- హిరణ్యకశిపుడిగా మునిపల్లె సుబ్బయ్య, అతని భార్య లీలావతిగా ‘సురభి’ కమలాబాయి, వారి కుమారుడైన ప్రహ్లాదుడిగా మాస్టర్ కృష్ణారావు ముఖ్యపాత్రలు పోషించారు.
- తెలుగు సినీ దిగ్గజంగా ఎదిగిన ఎల్.వి. ప్రసాద్ ఈసినిమాలో మొద్దబ్బాయిగా నటించారు.
- ‘భక్త ప్రహ్లాద’ సినిమాను తొలుత ముంబైలోని కృష్ణా సినిమా హాలులో విడుదల చేశారు.అక్కడ రెండు వారాలు ఆడిన తర్వాతే తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేశారు.
- ఈ సినిమాను తొలుత విజయవాడ (శ్రీమారుతి హాలు), రాజమండ్రి (శ్రీకృష్ణా హాలు)లలో ప్రదర్శించారు.