US Vs Russia : అమెరికా సముద్ర జలాల్లోకి రష్యా జలాంతర్గాములు.. ఏమైందంటే ?
అమెరికాకు చెందిన అలస్కా తీరంలో ఉన్న బఫర్ జోన్ ఏరియాను(US Vs Russia) అవి దాటాయి.
- By Pasha Published Date - 01:10 PM, Tue - 17 September 24

US Vs Russia : రష్యా, అమెరికాల మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. రష్యాతో యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్‌కు అమెరికా, నాటో దేశాలు ఆయుధాలను సప్లై చేస్తున్నాయి. ఆర్థిక సాయాన్ని అందిస్తున్నాయి. దీంతో ఆయా దేశాలపై రష్యా గుర్రుగా ఉంది. ఈనేపథ్యంలో రష్యాకు చెందిన రెండు జలాంతర్గాములు (సబ్ మెరైన్లు), ఒక ఫ్రిగేట్, ఒక టగ్‌బోట్ అమెరికాకు చెందిన సముద్ర జలాల్లోకి చొరబడ్డాయి. అమెరికాకు చెందిన అలస్కా తీరంలో ఉన్న బఫర్ జోన్ ఏరియాను(US Vs Russia) అవి దాటాయి. ఈవిషయాన్ని అమెరికా కోస్ట్ గార్డ్ వెల్లడించింది.
Also Read :Hindu Minorities : హిందువులపై దాడులు.. విచారణ జరిపేందుకు ఢాకాకు చేరుకున్న ఐరాస టీమ్
ఆ సబ్ మెరైన్లు, ఫ్రిగేట్, టగ్ బోట్ కదలికలను తాము నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపింది. అమెరికా సముద్ర సరిహద్దును దాటి 30 మైళ్ల లోపలికి అవి చొరబడ్డాయని పేర్కొంది. ప్రస్తుతం అవి అమెరికా ఎక్స్‌క్లూజివ్ ఎకనామిక్ జోన్‌లో ప్రయాణిస్తున్నాయని చెప్పింది. సముద్రంలో మంచు ఫలకాలను తప్పించుకోవడం కోసం రష్యా నేవీ టీమ్ ఈ రూట్‌లో ప్రయాణించి ఉంటుందని అమెరికా కోస్ట్‌గార్డ్ అంచనా వేసింది. ఇలా ప్రయాణించడం అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధమేం కాదని స్పష్టం చేసింది. అయినా దేశ భద్రతా అవసరాల రీత్యా వాటి కదలికలను తాము ట్రాక్ చేస్తున్నామని తెలిపింది. బేరింగ్ జలసంధి వద్ద అమెరికా సముద్ర సరిహద్దుల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న టైంలో వీటిని గుర్తించామని అమెరికా కోస్ట్‌గార్డ్ దళం పేర్కొంది.
Also Read :1948 September 17th : 1948 సెప్టెంబరు 17న తెలంగాణ చరిత్రలో అసలేం జరిగింది ?
ఇటీవల కాలంలో అమెరికా, నాటో దేశాలు, ఐరోపా దేశాలకు రష్యా అధ్యక్షుడు పుతిన్ వరుస వార్నింగ్స్ ఇస్తున్నారు. రష్యాపైకి ప్రత్యక్షంగా లేదా ఉక్రెయిన్ భూభాగం నుంచి లాంగ్ రేంజ్ మిస్సైళ్లను ప్రయోగిస్తే వదిలేది లేదని స్పష్టం చేశారు. ఎవరైనా ఆ పనిని చేస్తే.. తమ దేశంతో యుద్ధాన్ని మొదలుపెట్టినట్టుగా పరిగణిస్తామని తేల్చి చెప్పారు. ఉక్రెయిన్‌కు లాంగ్ రేంజ్ ఆయుధాలను సప్లై చేయొద్దనే ఉద్దేశంతో పుతిన్ ఈ హెచ్చరికలు చేశారు. ఒకవేళ ఉక్రెయిన్ చేతికి లాంగ్ రేంజ్ మిస్సైళ్లు అందితే.. రష్యాలో మరింత విధ్వంసం జరిగే ముప్పు ఉంది.