1948 September 17th : 1948 సెప్టెంబరు 17న తెలంగాణ చరిత్రలో అసలేం జరిగింది ?
సర్దార్ పటేల్, నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పక్కపక్కనే నడుచుకుంటూ వెళుతున్న ఫొటోగ్రాఫ్ మనకు నేటికి గూగుల్‌లో(1948 September 17th) కనిపిస్తుంది.
- By Pasha Published Date - 11:42 AM, Tue - 17 September 24

1948 September 17th : 1947 ఆగస్టు 15న మన దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. అయితే తెలంగాణకు మాత్రం నిజాం నవాబు పాలన నుంచి 1948 సెప్టెంబర్ 17న విముక్తి లభించింది. భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ పోలో’ పేరుతో 1948 సెప్టెంబర్ 13న సైనిక చర్యను నిర్వహించింది. దీంతో ఐదు రోజుల్లోనే నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గద్దె దిగాల్సి వచ్చింది. సెప్టెంబర్ 17న హైదరాబాద్ స్టేట్ ప్రాంతం భారత యూనియన్‌లో విలీనమైంది. నిజాం రాజు అప్పటి భారత యూనియన్ హోం మంత్రి సర్దార్ పటేల్ కు లొంగిపోయారు. ఇండియన్ యూనియన్‌లో హైదరాబాద్ చేరిక ఒప్పందంపై ఇరువురూ సంతకాలు చేశారు. అనంతరం సర్దార్ పటేల్, నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పక్కపక్కనే నడుచుకుంటూ వెళుతున్న ఫొటోగ్రాఫ్ మనకు నేటికి గూగుల్‌లో(1948 September 17th) కనిపిస్తుంది.
Also Read :Delhi New CM : ఢిల్లీ సీఎంగా ‘ఆప్’ దళిత నేత ? కాసేపట్లో క్లారిటీ
జునాగఢ్ పాలకుడిలా కాకుండా.. ఉస్మాన్ అలీఖాన్ భారత్‌లోనే చివరివరకూ ఉండిపోయారు. ఆయన గానీ, ఆయన కుటుంబం గానీ పాకిస్తాన్ పట్ల ఎన్నడూ విశ్వాసంతో లేరు. ఆయన కుటుంబ ఆస్తిలో చాలా భాగాన్ని భారత యానియన్‌కే ఇచ్చేశారు. ఢిల్లీలోని సుప్రసిద్ధమైన హైదరాబాద్ హౌజ్ కూడా భారత ప్రభుత్వానికి నిజాం నవాబు ఇచ్చిందే. సెప్టెంబరు 17వ తేదీని ‘తెలంగాణ విమోచన దినం’గా నిర్వహించాలని కొందరు వాదిస్తుంటే.. ‘తెలంగాణ విలీన దినం’గా నిర్వహించాలని ఇంకొందరు వాదిస్తున్నారు. మరికొందరు సెప్టెంబరు 17ను ‘సమైక్యతా దినం’గా జరపాలని కోరుతున్నారు. తాజాగా తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం సెప్టెంబర్ 17వ తేదీని ప్రజా పాలన దినోత్సవంగా జరపాలని నిర్ణయించింది.
- టెక్నికల్‌గా పరిశీలిస్తే.. సెప్టెంబర్ 17న తెలంగాణ పూర్తిగా భారతదేశంలో విలీనం కాలేదు. 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చేవరకు నిజాం పాలనలోనే తెలంగాణ ఉంది. అప్పటిదాకా పేరుకే నిజాం ప్రభువు అయినప్పటికీ ఇక్కడ పౌరప్రభుత్వం ఏర్పాటు నుంచి సైనిక శక్తి దాకా అంతా భారత ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లిపోయింది.
- బ్రిటీష్ పాలనా కాలంలో మన దేశంలో అతిపెద్ద సంస్థానం హైదరాబాద్. దాని పరిధిలో నేటి తెలంగాణ రాష్ట్రం, మహారాష్ట్రలోని మరఠ్వాడా ప్రాంతం, నేటి కర్నాటకలోని నాలుగు కన్నడ భాష మాట్లాడే జిల్లాలు ఉండేవి.
- హైదరాబాద్ రాజు ముస్లిం కావడంతో అత్యధికులు మాట్లాడే తెలుగు, కన్నడ, మరాఠీ భాషలకు ఆనాడు గుర్తింపు దక్కలేదు.
- నిజాం రాజ్యపు మద్దతుదారులుగా జాగీర్దారులు, దేశ్ ముఖ్‌లు, దేశ్ పాండేలు, భూస్వామ్య దొరలు ఉండేవారు. వీళ్లే పన్నులు వసూలు చేసి నిజాం నవాబుకు చెల్లించేవారు.
- నిజాం నవాబు కాలం నాటి బ్యూరోక్రసీలో ముస్లిం ఉన్నత వర్గాలే అధిక సంఖ్యలో ఉండేవారు.
- షోయబుల్లాఖాన్ ముస్లిమే అయినా ఓ జర్నలిస్టుగా నిజాం నిరకుంశత్వంపై పెన్ను ఎక్కుపెట్టి బలైపోయారు.
- నిజాంకు వ్యతిరేకంగా సాయుధ పోరాటానికి పిలుపునిచ్చిన ముగ్గురు నాయకుల్లో రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి తో పాటు మఖ్దూం మొహినోద్దీన్ కూడా ఉన్నారు.
- భారత స్వాతంత్య్రోద్యమం, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం దశాబ్దాలపాటు సమాంతరంగా సాగాయి. జాతీయోద్యమంలో చోటుచేసుకున్న ‘జలియన్‌వాలా బాగ్’ దురంతం వంటివాటికి ఉన్న గుర్తింపు నిజాం రాజ్యంలో చోటుచేసుకున్న దుర్ఘటనలకు లభించలేదు. గుండ్రాంపల్లి, బైరాన్‌పల్లి వంటి వందలాది గ్రామాలను నిరంకుశ నిజాం జలియన్‌వాలా బాగ్‌లుగా మార్చివేశాడు.