మిడిల్ ఈస్ట్‌లో యుద్ధ మేఘాలు.. ఆందోళనలో లక్షలాది మంది భారతీయులు!
రిక్రూట్మెంట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ కార్మికులు తమ ఉద్యోగాలను కాపాడుకోవాలని కోరుకుంటున్నారు. అదే సమయంలో స్వదేశంలో ఉన్న తమ కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని కొనసాగించాలని వారు భావిస్తున్నారు.
- Author : Gopichand
Date : 18-03-2026 - 7:56 IST
Published By : Hashtagu Telugu Desk
US Iran War: మిడిల్ ఈస్ట్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా ప్రభావాన్ని చూపుతున్నాయి. దీని ప్రత్యక్ష ప్రభావం గల్ఫ్ దేశాలలో పనిచేస్తూ అక్కడ సంపాదించిన డబ్బును తమ కుటుంబాలకు పంపిస్తున్న భారతీయులపై పడుతోంది. పశ్చిమ ఆసియాలో భీకర పోరు జరుగుతున్నప్పటికీ అక్కడ నివసిస్తున్న వలస భారతీయులు మాత్రం తిరిగి భారతదేశానికి రావడానికి ఇష్టపడటం లేదు.
రిక్రూట్మెంట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ కార్మికులు తమ ఉద్యోగాలను కాపాడుకోవాలని కోరుకుంటున్నారు. అదే సమయంలో స్వదేశంలో ఉన్న తమ కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని కొనసాగించాలని వారు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ కార్మికులకు సమయానికి వేతనాలు అందుతున్నాయి. కానీ ఇరాన్‌తో ముడిపడి ఉన్న ఈ యుద్ధం సుదీర్ఘ కాలం కొనసాగితే వారి మనుగడ కష్టతరం కావడమే కాకుండా ఉద్యోగాలు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది.
Also Read: పుచ్చకాయ తింటున్నారా? అయితే ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే!
భారతీయులు తిరిగి రావడానికి ఎందుకు ఇష్టపడటం లేదు?
ఎకనామిక్ టైమ్స్ కథనం ప్రకారం.. ‘అప్నా డాట్ కో’ (Apna.co) సీఈఓ కార్తీక్ నారాయణ్ మాట్లాడుతూ.. భారతీయ బ్లూ కాలర్ కార్మికులు గల్ఫ్ దేశాలలో నెలకు రూ. 30 వేల నుండి రూ. 1 లక్ష వరకు సంపాదిస్తున్నారని తెలిపారు. అదే భారతదేశంలో అయితే వారికి ఇందులో సగం సంపాదన మాత్రమే లభిస్తుంది. అందుకే వలస కార్మికులు ఈ దేశాల వైపు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు.
గల్ఫ్ దేశాలలో సుమారు 90 లక్షల మంది భారతీయులు బ్లూ కాలర్ ఉద్యోగాలలో ఉన్నారని, వీరు ప్రధానంగా నిర్మాణం, చమురు, సేవా రంగం, ఇతర శ్రమతో కూడిన పనుల్లో నిమగ్నమై ఉన్నారని ఆయన వివరించారు.
ఎలాంటి ప్రభావం పడవచ్చు?
గల్ఫ్ దేశాలకు కార్మికులను పంపే ‘ఫ్యూచర్స్ స్టాఫ్ఫింగ్ సొల్యూషన్స్’ వ్యవస్థాపకుడు ఫహ్రాన్ అజ్మీ తెలిపిన వివరాల ప్రకారం.. ఇప్పటికే చాలా మంది కార్మికులను ముందు జాగ్రత్తగా సెలవుపై వెళ్లాలని అక్కడి కంపెనీలు కోరుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ ఉమ్మడి దాడులు, ఆ తర్వాత టెహ్రాన్ ప్రతిదాడులతో ఈ ప్రాంతం అంతా ఉద్రిక్తంగా మారింది. అమెరికాకు మిత్రదేశాలైన యూఏఈ, ఖతార్, బహ్రెయిన్, సౌదీ అరేబియాపై ఇరాన్ డ్రోన్ దాడులు చేసే అవకాశం ఉందన్న వార్తలు వస్తున్నాయి.
బుధవారం నాటికి ఈ ఘర్షణ 19వ రోజుకు చేరుకుంది. యుద్ధం గనుక సుదీర్ఘంగా కొనసాగితే గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న లక్షలాది మంది భారతీయుల ఉద్యోగాలు, ఆదాయంపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.