US family policies: చైనా బాటలో అమెరికా.. పిల్లలను కనేవారికి ప్రత్యేక రాయితీలు.. అవేమిటంటే?
అమెరికాలో క్రమంగా జనాభా తగ్గుతున్న నేపథ్యంలో ట్రంప్ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమైంది.
- By News Desk Published Date - 08:26 PM, Tue - 22 April 25

US family policies: చైనాలో జనాభా రోజురోజుకు తగ్గిపోతుండటంతో అక్కడి ప్రభుత్వం జనాభా వృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో చైనా ప్రభుత్వం ముగ్గురు పిల్లల విధానానికి పచ్చజెండా ఊపింది. 2016లో ఇద్దరు పిల్లలు కనేందుకు చట్టం చేసిన ప్రభుత్వం.. దాన్ని మార్పు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే, చైనాలోని కొన్ని ప్రావిన్సులు పిల్లల్ని కనేవారికి లోన్లు, ప్రత్యేక రాయితీలను కూడా అందిస్తున్నాయి. ఒక ప్రావిన్స్ పెళ్లయిన జంటలకు 31 వేల డాలర్లు (సుమారు రూ. 23 లక్షలు) బేబీ లోన్ ప్రకటించింది. ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే, చైనా ప్రభుత్వం అధికారికంగా పిల్లల్ని కనేవారికి ప్రత్యేక ఆఫర్లు ఇస్తున్నట్లు ఇంకా సమాచారం లేదు. కేవలం కొన్ని ప్రావిన్సుల స్థాయిలో మాత్రమే ప్రత్యేక రాయితీలు అమలవుతున్నాయి.
Also Read: Raj Kasireddy : రాజ్ కసిరెడ్డి విచారణ పూర్తి.. ఏం అడిగారు ? ఏం చెప్పాడు ?
ప్రస్తుతం చైనా బాటలో నడిచేందుకు అమెరికా సిద్ధమైంది. అమెరికాలో క్రమంగా జనాభా తగ్గుతున్న నేపథ్యంలో ట్రంప్ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమైంది. అమెరికాలో 1990ల నుంచి జననాల రేటు క్రమంగా క్షీణిస్తోంది. సీడీసీ (CDC) నివేదిక ప్రకారం.. 2023లో సంతానోత్పత్తి రేటు 1.62గా ఉంది. రీప్లేస్‌మెంట్ రేటు కంటే చాలా తక్కువ. పెరుగుతున్న జీవన వ్యయం, శ్రామిక రంగంలో మహిళలు భాగస్వామ్యం పెరగడం, సామాజిక విలువల్లో మార్పుల వంటివి ఈ తగ్గుదలకు కారణంగా నిపుణులు పేర్కొంటున్నారు.
అమెరికాలో క్షీణిస్తున్న సంతానోత్పత్తిపై ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పలు సందర్భాల్లో ప్రస్తావించారు. నాగరికత సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు ఎలాన్ మస్క్ కూడా అధిక సంతానానికి మద్దతు తెలుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సంతానోత్పత్తి పెంచేందుకు అమెరికా కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమైంది.
Also Read: Rajya Sabha: ఏపీ రాజ్యసభ స్థానం బీజేపీకే.. రేసులో అన్నామలై, స్మృతి ఇరానీ
పిల్లలను కనేలా ప్రోత్సహించేందుకు ట్రంప్ యంత్రాంగం ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా జన్మనిచ్చిన మహిళకు ఐదు వేల డాలర్ల ‘బేబీ బోనస్’ వంటి అంశాలపై అధికారులు కసరత్తు చేస్తున్నట్లు అమెరికన్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఇటీవల వైట్‌హౌస్‌లో అంతర్గతంగా ఓ కీలక సమావేశం నిర్వహించినట్లు తెలిసింది. సంతాన సాఫల్యంపై మహిళలకు అవగాహన, బిడ్డల్ని కనే కుటుంబాలకు ప్రోత్సాహకాలు చర్చకు వచ్చాయి. ఇందులో భాగంగా బిడ్డకు జన్మనిచ్చే ప్రతి అమెరికన్ మాతృమూర్తికి ‘బేబీ బోనస్’ కింద ఐదు వేల డాలర్లు, పన్ను మినహాయింపుల వంటి అంశాలు ప్రతిపాదించినట్లు తెలిసింది.
అంతేకాక.. పిల్లల విద్య సమయంలోనూ ప్రత్యేక పథకాలతో నగదును అందించేలా అమెరికా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి తగ్గిపోతున్న జనాభాను పెంచుకునేందుకు అమెరికా ప్రభుత్వం చైనా తరహా విధానాన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతోందని ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది.