ట్రంప్ విధానాలపై చైనా ఘాటు విమర్శలు!
ఈ సంక్షోభాన్ని ఆసరాగా చేసుకుని చైనా తనను తాను ఒక బాధ్యతాయుతమైన ప్రపంచ శక్తిగా, శాంతి మధ్యవర్తిగా నిలబెట్టుకోవాలని చూస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
- Author : Gopichand
Date : 26-01-2026 - 10:09 IST
Published By : Hashtagu Telugu Desk
Trump: మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. ఈ తరుణంలో చైనా తన దౌత్యపరమైన చొరవను పెంచుతూ అమెరికాకు వ్యతిరేకంగా గళం విప్పింది. సోమవారం బీజింగ్‌లో 57 ముస్లిం దేశాల కూటమి అయిన OIC (ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్) సెక్రటరీ జనరల్‌తో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ కీలక సమావేశం నిర్వహించారు. ఇరాన్‌ను దిగ్బంధించడానికి అమెరికా తన భారీ నౌకాదళాన్ని పంపడం, అదే సమయంలో తనపై జరిగే ఏ దాడి అయినా పూర్తి స్థాయి యుద్ధానికి దారితీస్తుందని ఇరాన్ హెచ్చరించిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
ట్రంప్ విధానాలపై చైనా ఘాటు విమర్శలు
ట్రంప్ పరిపాలనలోని విధానాలను చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ తీవ్రంగా విమర్శించారు. శక్తివంతమైన దేశాలు తమ ఇష్టానుసారం ఇతర దేశాలపై ఆంక్షలు లేదా సైనిక చర్యలను రుద్దే అడవి చట్టం వైపు ప్రపంచం వెళ్లకుండా అడ్డుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ట్రంప్ అనుసరిస్తున్న టారిఫ్ విధానాలు, సైనిక బెదిరింపుల వల్ల ప్రపంచ వ్యవస్థ దెబ్బతింటోందని చైనా భావిస్తోంది. వివాదాలను బాంబులు, మందుగుండు సామగ్రితో కాకుండా చర్చలు, రాజకీయ సంభాషణల ద్వారా పరిష్కరించుకోవాలని ఇస్లామిక్ దేశాలతో కలిసి అభివృద్ధి చెందుతున్న దేశాల హక్కులను కాపాడతామని చైనా స్పష్టం చేసింది.
Also Read: మొబైల్ ఫోన్ అతిగా వాడుతున్నారా? అయితే ఈ వార్త మీకోసమే!
ఇరాన్‌లో ముదురుతున్న మానవీయ- సైనిక సంక్షోభం
ప్రాంతీయ ఉద్రిక్తతల మధ్య ఇరాన్ నుండి దిగ్భ్రాంతికరమైన వార్తలు వస్తున్నాయి. ఆర్థిక ఇబ్బందులకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో ఇప్పటివరకు సుమారు 5,000 మంది మరణించారని ఒక ఇరాన్ అధికారి పేర్కొన్నారు. ఈ గణాంకాలు ఇంకా అధికారికంగా ధృవీకరించబడనప్పటికీ అక్కడ పరిస్థితులు ఎంతలా దిగజారుతున్నాయో దీని ద్వారా అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ఇరాన్ అణు కార్యక్రమం, నిరసనకారులపై చేస్తున్న చర్యల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అమెరికాకు చెందిన విమాన వాహక నౌకలు, క్షిపణులతో కూడిన యుద్ధనౌకలు మధ్యప్రాచ్యం వైపు వేగంగా దూసుకుపోతున్నాయి.
ప్రపంచ శక్తి సమతుల్యతను మార్చే ప్రయత్నం
ఈ సంక్షోభాన్ని ఆసరాగా చేసుకుని చైనా తనను తాను ఒక బాధ్యతాయుతమైన ప్రపంచ శక్తిగా, శాంతి మధ్యవర్తిగా నిలబెట్టుకోవాలని చూస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చైనా తీసుకుంటున్న ఈ చొరవ కేవలం ప్రాంతీయ రాజకీయాలనే కాకుండా ప్రపంచ శక్తి సమతుల్యతను కూడా ప్రభావితం చేయవచ్చు. బాహ్య శక్తుల జోక్యం లేకుండా పరస్పర సహకారంతో కూడిన భద్రతా భాగస్వామ్యాన్ని మధ్యప్రాచ్యంలో నిర్మించాలని వాంగ్ యీ స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారు. అమెరికా సైనిక శక్తి ముందు చైనా దౌత్యం ఎంతవరకు పని చేస్తుంది? ఈ కొత్త కూటమి ట్రంప్ నిర్ణయాలకు అడ్డుకట్ట వేయగలదా? అనేది రాబోయే రోజుల్లో చూడాలి.