Rahul Gandhi US Tour: రాహుల్ అమెరికా పర్యటనపై ఉత్కంఠ…
కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ రాహుల్ గాంధీ 10 రోజుల పాటు అమెరికాలో పర్యటించనున్నారు. మే 31న రాహుల్ అమెరికా వెళ్లనున్నారు.
- Author : Praveen Aluthuru
Date : 16-05-2023 - 4:56 IST
Published By : Hashtagu Telugu Desk
Rahul Gandhi US Tour: కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ రాహుల్ గాంధీ 10 రోజుల పాటు అమెరికాలో పర్యటించనున్నారు. మే 31న రాహుల్ అమెరికా వెళ్లనున్నారు. జూన్ 4న న్యూయార్క్‌లోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో దాదాపు 5,000 మంది ఎన్నారైలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు. అదేవిధంగా స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రసంగించనున్నారు. అందులో భాగంగా రాహుల్ వాషింగ్టన్ మరియు కాలిఫోర్నియాలో బిజీబిజీగా గడపనున్నారు. అనంతరం రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలతోనూ సమావేశం కానున్నారు.
2023 మర్చిలో రాహుల్ గాంధీ లండన్ లో పర్యటించిన విషయం తెలిసిందే. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో జర్నలిస్ట్‌ల సంఘం ఏర్పాటు చేసిన సమావేశంలో రాహుల్ మాట్లాడారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. భారత ప్రజాస్వామ్యం ఒత్తిడిలో ఉందని, అనేక విధాలుగా దాడికి గురవుతోందని విదేశీ గడ్డపై వ్యాఖ్యానించడం అప్పట్లో సంచలనంగా మారింది. ప్రతిపక్షాల గొంతులను నొక్కుతున్నారని, ప్రశ్నిస్తే అణచివేస్తున్నారని, మైనారిటీలు, మీడియా ప్రతినిధులు దాడికి గురవుతున్నాయని రాహుల్ ఆరోపణలు చేశారు. అయితే రాహుల్ గాంధీ చేసిన ఈ హాట్ కామెంట్స్ పై బీజేపీ మండిపడింది. విదేశీ గడ్డపై భారత ప్రభుత్వం గురించి నీచంగా మాట్లాడారంటూ మాటల యుద్ధం మొదలుపెట్టింది. రాహుల్ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. అప్పట్లో రాహుల్ బ్రిటన్‌లో చేసిన వ్యాఖ్యలు భారత్‌లో సంచలనం సృష్టించాయి.
రాహుల్ గాంధీ అమెరికా టూర్ నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది. బ్రిటన్ గడ్డపై రాహుల్ చేసిన కామెంట్స్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. కాగా ఇప్పుడు రాహుల్ అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో రాహుల్ ఎం మాట్లాడుతారోనన్న క్యూరియాసిటీ నెలకొంది.
రాహుల్ విదేశీ పర్యటన అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటించనున్నారు. మోడీ జూన్ 22న అమెరికాకు అధికారిక పర్యటనకు వెళ్లనున్నారు. తన పర్యటన సందర్భంగా ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ మరియు ప్రథమ మహిళ జిల్ బిడెన్ వైట్ హౌస్‌లో రాష్ట్ర విందులో ఆతిథ్యం ఇవ్వనున్నారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గత వారం ఈ సమాచారాన్ని చేరవేసింది.
Read More: Pakistan Chief Justice : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై కేసు పెట్టేందుకు కమిటీ