Imran Khan: ఇమ్రాన్ ఖాన్‌పై అయిదేళ్ల నిషేధం విధించిన పాక్ ఎన్నికల సంఘం.. ఎందుకంటే..?
మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.
- By Gopichand Published Date - 05:40 PM, Fri - 21 October 22

మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. విదేశీ నేతల నుంచి తనకు లభించిన బహుమతులను విక్రయించడం ద్వారా వచ్చిన ఆదాయాన్ని దాచినందుకు తోషాఖానా కేసులో ఐదేళ్లపాటు ప్రభుత్వ పదవిలో కొనసాగడానికి పాకిస్థాన్ అత్యున్నత ఎన్నికల సంఘం శుక్రవారం అనర్హత వేటు వేసింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సికిందర్ సుల్తాన్ రాజా నేతృత్వంలోని నలుగురు సభ్యుల బెంచ్ ఏకాభిప్రాయ తీర్పు తర్వాత.. పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) ఛైర్మన్ ఐదేళ్లపాటు పార్లమెంటు సభ్యుడు కాలేరు. ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ కేసును విచారించిన ECP సెప్టెంబర్ 19న విచారణ ముగింపుపై తన తీర్పును రిజర్వ్ చేసింది. ఖాన్ అవినీతి కార్యకలాపాలకు పాల్పడ్డారని.. ఆయన పార్లమెంటు సభ్యుడిగా అనర్హుడని శుక్రవారం ECP ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పునిచ్చింది. అవినీతి చట్టాల ప్రకారం అతనిపై చర్యలు తీసుకుంటామని కూడా ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని ఇస్లామాబాద్ హైకోర్టులో సవాలు చేయనున్నట్టు ఖాన్ పార్టీ సెక్రటరీ జనరల్ అసద్ ఉమర్ ప్రకటించారు. కీలకమైన ఉపఎన్నికలను సోమవారం నాడు ఖాన్ పార్టీ క్లీన్ స్వీప్ చేసి ఎనిమిది నేషనల్ అసెంబ్లీ స్థానాల్లో ఆరింటిని, మూడు ప్రావిన్షియల్ అసెంబ్లీ సీట్లలో రెండు గెలుచుకున్న కొద్ది రోజుల తర్వాత ఈ తీర్పు వచ్చింది.
ఆదివారం జరిగిన కీలక ఉప ఎన్నికల్లో ఏడు జాతీయ అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసిన ఖాన్ ఆరు నియోజకవర్గాల్లో విజయం సాధించారు. 2018లో అధికారంలోకి వచ్చిన ఖాన్ అధికారిక సందర్శనల సమయంలో ధనిక అరబ్ పాలకుల నుండి ఖరీదైన బహుమతులు అందుకున్నాడు. అవి తోషాఖానాలో జమ చేయబడ్డాయి. తరువాత అతను సంబంధిత చట్టాల ప్రకారం తగ్గింపు ధరకు కొనుగోలు చేసి.. భారీ లాభాలకు విక్రయించాడు. రాష్ట్ర ఖజానా నుంచి 21.56 మిలియన్లు చెల్లించి కొనుగోలు చేసిన బహుమతుల విక్రయం ద్వారా దాదాపు 58 మిలియన్లు వచ్చినట్లు విచారణ సందర్భంగా మాజీ ప్రధాని ఈసీపీకి తెలియజేశారు.
పాలక సంకీర్ణ ప్రభుత్వ చట్టసభ సభ్యులు 70 ఏళ్ల ఖాన్‌పై ఆగస్టులో పాకిస్తాన్ ఎన్నికల కమిషన్ (ECP)లో కేసు దాఖలు చేశారు. అతను గిఫ్టుల అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయాన్ని వెల్లడించడంలో విఫలమైనందుకు అతనిపై అనర్హత వేటు వేయాలని కోరింది. తోషాఖానా శాఖను 1974లో ఏర్పాటు చేశారు. విదేశీ నేతలు ఇచ్చే ఖరీదైన బహుమతుల్ని ఆ శాఖ తమ ఆధీనంలో ఉంచుకుంటుంది. ఎవరికి గిఫ్ట్స్ వచ్చినా ఆ విషయాన్ని కేబినెట్‌కు చెప్పాల్సి ఉంటుంది. కానీ పీటీఐ ప్రభుత్వం హయాంలో ఇమ్రాన్‌కు వచ్చిన బహుమతుల లెక్క తేలలేదు. ప్రధానిగా ఉన్న సమయంలో నాలుగు బహుమతుల్ని అమ్ముకున్నట్లు ఇమ్రాన్ కేసు విచారణ సందర్భంగా ఒప్పుకున్నారు. ఇమ్రాన్ అమ్మినవాటిలో రిస్ట్ వాచ్‌లు, ఖరీదైన పెన్, రింగ్‌తో పాటు రోలెక్స్ వాచీలు ఉన్నాయి.