Pakistan Arrest Indians: ఆరుగురు భారతీయులను అరెస్టు చేసిన పాక్.. కారణమిదే..?
మాదక ద్రవ్యాలు, ఆయుధాలు, మందుగుండు సామగ్రి అక్రమ రవాణాకు ప్రయత్నించారనే ఆరోపణలతో ఆరుగురు భారతీయులను పాకిస్థానీ రేంజర్లు అరెస్టు (Pakistan Arrest Indians) చేశారు.
- Author : Gopichand
Date : 23-08-2023 - 6:52 IST
Published By : Hashtagu Telugu Desk
Pakistan Arrest Indians: మాదక ద్రవ్యాలు, ఆయుధాలు, మందుగుండు సామగ్రి అక్రమ రవాణాకు ప్రయత్నించారనే ఆరోపణలతో ఆరుగురు భారతీయులను పాకిస్థానీ రేంజర్లు అరెస్టు (Pakistan Arrest Indians) చేశారు. మంగళవారం (ఆగస్టు 22) పాక్ సైన్యం ఈ సమాచారాన్ని ఇచ్చింది. పాకిస్తాన్ ఆర్మీ ప్రకారం.. ఈ అరెస్టులు జూలై 29- ఆగస్టు 3 మధ్య జరిగాయి. జూలై 29 నుండి ఆగస్టు 3 వరకు పాకిస్తాన్ భూభాగంలోకి ప్రవేశించిన 6 మంది భారతీయ పౌరులను భారతదేశంతో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి మోహరించిన పాకిస్తాన్ రేంజర్స్ సైనికులు పట్టుకున్నారని ఆర్మీ ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ మీడియా ముందు పేర్కొంది. అయితే పాక్ సైన్యం చేసిన ఈ వాదనపై భారత అధికారుల నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు.
అక్రమ రవాణాకు యత్నించిన భారతీయులు
పాక్‌లోకి మాదక ద్రవ్యాలు, ఆయుధాలు, మందుగుండు సామగ్రిని అక్రమంగా తరలించడానికి ప్రయత్నిస్తున్న స్మగ్లర్లు, నేరస్థులు అరెస్టయ్యారని ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR) ప్రకటన పేర్కొంది. ఈ భారతీయ స్మగ్లర్లు అక్రమంగా పాకిస్తాన్‌లోకి ప్రవేశించినందుకు ఆ దేశ చట్టాల ప్రకారం వ్యవహరిస్తారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడడం, ఇతర భద్రతా సంబంధిత అంశాలపై వారిని విచారిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.
Also Read: Korean Beauty Tips: కొరియన్స్ అంత అందంగా మారాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే?
ఈ స్మగ్లర్లలో నలుగురు పంజాబ్ ఫిరోజ్‌పూర్‌కు చెందిన భారతీయులు అని పేర్కొన్నారు. వీరి పేర్లు గుర్మీజ్ s/o గుల్దీప్ సింగ్, షిందర్ సింగ్ s/o భోరా సింగ్, జుగీందర్ సింగ్ s/o ఠాకూర్ సింగ్, విశాల్ s/o జగ్గాగా గుర్తించారు. రతన్ పాల్ సింగ్ జలంధర్ నుండి, గర్వేందర్ సింగ్ లుధియానాకు చెందినట్లు గుర్తించారు. సరిహద్దుల్లో పాక్ భద్రతా బలగాలు నిఘాను కొనసాగిస్తున్నాయని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
ఇద్దరు పాకిస్థానీ స్మగ్లర్లను కూడా భారత్ పట్టుకుంది
సోమవారం (ఆగస్టు 21) ఫిరోజ్‌పూర్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద భారత సరిహద్దు భద్రతా దళం సిబ్బంది ఇద్దరు పాకిస్థానీ స్మగ్లర్లను పట్టుకున్నారు. పట్టుబడిన వారి నుంచి దాదాపు 30 కిలోల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయంగా పట్టుబడిన ఈ డ్రగ్ విలువ రూ.75 కోట్లు ఉంటుందని సమాచారం.