Nobel Peace Prize 2025: నా నోబెల్ బహుమతి ట్రంప్‌కు అంకితం: మారియా కోరినా
ఈ నేపథ్యంలో వెనుజులా సమస్యపై మద్దతు ఇచ్చినందుకు గాను ఈ నోబెల్ శాంతి పురస్కారాన్ని ట్రంప్‌కు అంకితం చేస్తున్నట్లు మారియా కోరినా ప్రకటించారు.
- By Gopichand Published Date - 09:51 PM, Fri - 10 October 25

Nobel Peace Prize 2025: వెంజులా ప్రతిపక్ష నాయకురాలు మారియా కోరినా మచాడోకు శాంతి నోబెల్ బహుమతి (Nobel Peace Prize 2025)ని ప్రకటించారు. దీంతో నోబెల్ బహుమతికి తాను అతిపెద్ద పోటీదారునని పదేపదే చెప్పుకునే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కల చెదిరిపోయింది. ఈ నేపథ్యంలో వెనుజులా సమస్యపై మద్దతు ఇచ్చినందుకు గాను ఈ నోబెల్ శాంతి పురస్కారాన్ని ట్రంప్‌కు అంకితం చేస్తున్నట్లు మారియా కోరినా ప్రకటించారు.
మారియా కోరినా మచాడో ఏమన్నారు?
మారియా కోరినా మచాడో ‘X’ (ట్విట్టర్)లో పోస్ట్ చేస్తూ.. “వెనుజులా ప్రజలందరి పోరాటానికి దక్కిన ఈ గుర్తింపు, మా పనిని పూర్తి చేయడానికి ఒక గొప్ప స్ఫూర్తి. మేము విజయం అంచున ఉన్నాము. గతంలో కంటే ఎక్కువ స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం సాధించడానికి మేము అధ్యక్షుడు ట్రంప్, యునైటెడ్ స్టేట్స్, లాటిన్ అమెరికా ప్రజలు, ప్రపంచంలోని ప్రజాస్వామ్య దేశాలను మా ముఖ్య మిత్రులుగా విశ్వసిస్తున్నాము” అని రాశారు.
Also Read: Eiffel Tower : ఈఫిల్ టవర్ను కూల్చనున్నారా? అసలు నిజం ఏంటి..?
ట్రంప్‌పై మారియా కోరినా కీలక ప్రకటన
ఆమె ఇంకా మాట్లాడుతూ.. “వెనుజులాలో కష్టాలు పడుతున్న ప్రజలకు, మా లక్ష్యం పట్ల నిర్ణయాత్మక మద్దతు ఇచ్చినందుకు గాను నేను ఈ అవార్డును అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అంకితం చేస్తున్నాను” అని అన్నారు. ప్రజాస్వామ్య హక్కులను ప్రోత్సహించినందుకు, నిరంకుశత్వం నుండి ప్రజాస్వామ్యంలోకి న్యాయమైన, శాంతియుత మార్పు కోసం చేసిన పోరాటానికి గాను మారియా కోరినా మచాడోకు 2025 నోబెల్ శాంతి పురస్కారాన్ని అందించాలని నార్వేజియన్ నోబెల్ కమిటీ నిర్ణయించింది.
నోబెల్ పురస్కారం చుట్టూ చర్చ
ఈ సంవత్సరం నోబెల్ శాంతి బహుమతి చాలా చర్చనీయాంశమైంది. పాకిస్తాన్, ఇజ్రాయెల్, రష్యా, అజర్‌బైజాన్, థాయ్‌లాండ్, అర్మేనియా, కంబోడియా వంటి అనేక దేశాలు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను ఈ అవార్డుకు నామినేట్ చేశాయి. ఈ ప్రతిష్టాత్మక అవార్డు కోసం ఈ సంవత్సరం 338 నామినేషన్లు అందాయి. వీటిలో 94 సంస్థలు, వివిధ రంగాలకు చెందిన 244 మంది వ్యక్తులు ఉన్నారు.