Nepal: నేపాల్‌లో సోషల్ మీడియా బ్యాన్
Nepal: నేపాల్ ప్రభుత్వం ఇటీవల ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, యూట్యూబ్, స్నాప్‌చాట్ సహా 26 ప్రధాన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను నిషేధించాలని తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా తీవ్ర ప్రతిఘటనకు దారితీసింది.
- By Kavya Krishna Published Date - 02:24 PM, Mon - 8 September 25

Nepal: నేపాల్ ప్రభుత్వం ఇటీవల ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, యూట్యూబ్, స్నాప్‌చాట్ సహా 26 ప్రధాన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను నిషేధించాలని తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా తీవ్ర ప్రతిఘటనకు దారితీసింది. ముఖ్యంగా జనరేషన్ జెడ్ (1990ల చివరలో, 2000 ప్రారంభంలో జన్మించిన యువత) పెద్ద సంఖ్యలో వీధుల్లోకి వచ్చి నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఖాట్మండు సహా పలు ప్రాంతాల్లో నిరసనకారులు రోడ్లపైకి దూసుకొచ్చి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో నిరసనకారులు, పోలీసుల మధ్య ఘర్షణలు చెలరేగి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని ప్రాంతాల్లో రాళ్ల దాడులు, అడ్డగోలు అరెస్టులు జరిగినట్లు సమాచారం.
Bihar : బిహార్ ఎన్నికల..నోటిఫికేషన్ కంటే ముందే హెలికాప్టర్లకు హవా!
పరిస్థితి అదుపులో లేకపోవడంతో, ఖాట్మండు జిల్లా పరిపాలన ముందుజాగ్రత్త చర్యగా కర్ఫ్యూ విధించింది. న్యూ బనేశ్వర్, చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్ద ఎత్తున యువకులు నిరసనలో పాల్గొనడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. నిరసనకారులు నిషేధిత ప్రాంతాల్లోకి చొరబడటంతో పరిస్థితి అదుపు తప్పే అవకాశం ఉందని భావించిన జిల్లా అధికారులు తక్షణమే ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఖాట్మండు చీఫ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ చాబిలాల్ రిజల్ సోమవారం మధ్యాహ్నం 12:30 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుందని ప్రకటించారు.
కర్ఫ్యూ ప్రాంతాల్లో ప్రజలు బయటకు రావొద్దని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలు చేపట్టరాదని హెచ్చరించారు. నేపాల్ ప్రభుత్వం సోషల్ మీడియా నిషేధ నిర్ణయం వెనుక సామాజిక అవినీతి నివారణ, తప్పుడు ప్రచారాలు, మోసపూరిత సమాచారం నియంత్రణ కారణాలుగా పేర్కొన్నప్పటికీ, యువత మాత్రం ఇది తమ వ్యక్తిగత స్వేచ్ఛ, అభివ్యక్తి స్వాతంత్ర్యంపై దాడిగా భావిస్తోంది. ఈ నిర్ణయం వెనుక రాజకీయ ఉద్దేశాలే ఉన్నాయని ఆరోపిస్తూ నిరసనలు కొనసాగించడానికి సిద్ధమవుతున్నారు.
Nara Lokesh : అన్నామలైతో మంత్రి లోకేశ్ భేటీ