ట్రంప్‌కు నోబెల్ శాంతి మెడల్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన మారియా కొరినా!
వెనిజులా రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ట్రంప్-మచాడో భేటీ, ఆమె అనుసరించిన ఈ 'గిఫ్ట్ డిప్లొమసీ' రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
- Author : Gopichand
Date : 16-01-2026 - 5:25 IST
Published By : Hashtagu Telugu Desk
Trump With Nobel Award: వెనిజులాకు చెందిన నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మారియా కొరినా మచాడో తన మెడల్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు బహుమతిగా ఇచ్చారు. నిన్న వాషింగ్టన్‌లోని వైట్ హౌస్‌లో అధ్యక్షుడు ట్రంప్‌తో భేటీ అయిన ఆమె తన మెడల్‌ను ఒక ఫ్రేమ్‌లో అమర్చి ఆయనకు గిఫ్ట్‌గా అందించారు. అయితే ఇప్పుడు ఒక ప్రశ్న తలెత్తుతోంది. మెడల్ బహుమతిగా పొందినంత మాత్రాన అధ్యక్షుడు ట్రంప్ నోబెల్ విజేత అయిపోతారా? నోబెల్ అవార్డు, ఆ బిరుదుకు సంబంధించి ఎటువంటి నిబంధనలు ఉన్నాయి?
తనను తాను నోబెల్ విజేతగా భావించే ట్రంప్
అధ్యక్షుడు ట్రంప్ 2025 నోబెల్ శాంతి బహుమతి కోసం తనను తాను నామినేట్ చేసుకున్నారని, తన మిత్ర దేశాల ద్వారా కూడా నామినేట్ చేయించుకున్నారని ప్రపంచం మొత్తానికి తెలుసు. దాదాపు 9 యుద్ధాలను ముగించిన లేదా కాల్పుల విరమణ చేయించిన క్రెడిట్ తనదేనని ఆయన చెప్పుకుంటారు. అందుకే తాను నోబెల్ శాంతి బహుమతికి అర్హుడినని భావిస్తారు. అయితే వెనిజులాకు చెందిన మచాడోకు నోబెల్ రావడంతో ట్రంప్ కొంత అసంతృప్తికి లోనయ్యారు. కానీ ఇప్పుడు ట్రంప్ తన శక్తిని ఉపయోగించి వెనిజులాలో మదురో ప్రభుత్వాన్ని కూల్చివేయడంతో, మచాడో ఆయనకు అభిమానిగా మారి తన మెడల్నే బహుమతిగా ఇచ్చారు.
Also Read: రోగనిరోధక శక్తి పెరగాలంటే రోజూ ఇలా చేయాల్సిందే!
మచాడో ‘గిఫ్ట్ డిప్లొమసీ’
వెనిజులా రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ట్రంప్-మచాడో భేటీ, ఆమె అనుసరించిన ఈ ‘గిఫ్ట్ డిప్లొమసీ’ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అధ్యక్షుడు ట్రంప్ కూడా మచాడో నిర్ణయాన్ని ప్రశంసించారు. రాజకీయ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మచాడో ట్రంప్ ద్వారా వెనిజులా అధికారాన్ని చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అయితే స్థానిక నేతలు, ప్రజల మద్దతు లేకపోవడం వల్ల ఆమెకు అది అంత సులభం కాకపోవచ్చు. మెడల్‌ను బహుమతిగా ఇస్తూనే వెనిజులాలో తన పాత్రను ఖరారు చేయాలని ఆమె ట్రంప్‌ను కోరినట్లు సమాచారం.
REPORTER: "Did you offer to President Trump your Nobel Peace Prize?"
MARÍA CORINA MACHADO: "I presented the President of the United States the medal…the Nobel Peace Prize."
"Two hundred years ago, General Lafayette gave Simón Bolívar a medal with George Washington's face on… pic.twitter.com/xR69XpQCk8
— Fox News (@FoxNews) January 16, 2026
నోబెల్ అవార్డు నిబంధనలు ఇవే
నిబంధనల ప్రకారం మెడల్ దక్కినంత మాత్రాన అధ్యక్షుడు ట్రంప్ నోబెల్ విజేత కాలేరు. నార్వేజియన్ నోబెల్ కమిటీ రూపొందించిన కఠినమైన నిబంధనలను ఎవరూ ఉల్లంఘించలేరు. ఒకసారి అవార్డు ప్రకటించిన తర్వాత దానిని తిరిగి తీసుకోవడం గానీ, వెనక్కి ఇచ్చేయడం గానీ కుదరదు. ఈ అవార్డును ఇతరులతో పంచుకోవడం లేదా వేరే వారి పేరు మీదకు బదిలీ చేయడం సాధ్యం కాదు. మెడల్ (బంగారు నాణెం) యజమాని మారవచ్చు కానీ ‘నోబెల్ శాంతి బహుమతి గ్రహీత’ అనే బిరుదు మాత్రం మారదు.
120 ఏళ్లుగా మారని డిజైన్
నోబెల్ బహుమతిలో ఇచ్చే మెడల్ స్వచ్ఛమైన బంగారంతో తయారవుతుంది. దీని బరువు 196 గ్రాములు, వ్యాసం 6.6 సెం.మీ ఉంటుంది. గత 120 ఏళ్లుగా ఈ మెడల్ డిజైన్ మారలేదు. దీనిపై ఒకవైపు ఆల్ఫ్రెడ్ నోబెల్ చిత్రం ఉంటుంది. మరోవైపు ముగ్గురు పురుషులు ఒకరి భుజాలపై ఒకరు చేయి వేసుకుని ఉన్న విగ్రహం ఉంటుంది. ఇది సోదరభావానికి చిహ్నం.
గతంలో కూడా మెడల్స్‌ను వేలం వేసిన లేదా దానం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఉదాహరణకు డిమిత్రి మురాటోవ్ ఉక్రెయిన్ యుద్ధ బాధితుల కోసం తన మెడల్‌ను 100 మిలియన్ డాలర్లకు పైగా ధరకు వేలం వేశారు. అలాగే నార్వే తొలి నోబెల్ విజేత క్రిస్టియన్ లూస్ లాంగే మెడల్‌ను ప్రస్తుతం నోబెల్ పీస్ సెంటర్లో ప్రదర్శనలో ఉంచారు.