ఇరాన్-అమెరికా-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం.. సముద్ర మార్గంలో ఉద్రిక్తతలు!
గతంలో కూడా ఇరాన్ తాము 3 అమెరికన్-బ్రిటిష్ ట్యాంకర్లను దెబ్బతీశామని, స్ట్రైట్‌ను 'క్లోజ్' చేశామని పేర్కొంది. అయితే అమెరికా మాత్రం ఇరాన్ నావికాదళాన్ని పూర్తిగా ధ్వంసం చేశామని చెబుతోంది.
- Author : Gopichand
Date : 05-03-2026 - 4:02 IST
Published By : Hashtagu Telugu Desk
Israel-US-Iran War: ఇరాన్-అమెరికా-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధంలో సముద్ర మార్గంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఉత్తర పర్షియన్ గల్ఫ్‌లో ఒక అమెరికన్ ఆయిల్ ట్యాంకర్‌పై తమ నౌకాదళం క్షిపణి దాడి చేసిందని ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) గురువారం ప్రకటించింది. IRGC కథనం ప్రకారం.. ఆ నౌకపై దాడి జరగగా, అది ప్రస్తుతం కాలిపోతోంది.
ఇది అమెరికా ‘దురాక్రమణ’కు సమాధానం
ఇరాన్ స్టేట్ మీడియా ‘మెహర్ న్యూస్’ ప్రకారం.. అమెరికా ‘దురాక్రమణ’కు ప్రతీకారంగానే ఈ దాడి జరిగిందని IRGC పేర్కొంది. ఇకపై స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ గుండా అమెరికా, ఇజ్రాయెల్ లేదా వారికి మద్దతు ఇచ్చే యూరోపియన్ దేశాల సైనిక లేదా వాణిజ్య నౌకలను అనుమతించబోమని హెచ్చరించింది. అటువంటి నౌకలు కనిపిస్తే వాటిని లక్ష్యంగా చేసుకుంటామని స్పష్టం చేసింది. యుద్ధ సమయంలో స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ పై నియంత్రణ ఇరాన్‌దేనని IRGC పునరుద్ఘాటించింది.
గల్ఫ్‌లో నౌకాయానంపై పెరుగుతున్న ముప్పు
హిందూ మహాసముద్రంలో అమెరికన్ సబ్ మెరైన్, ఇరాన్ ఫ్రిగేట్ ‘IRIS దేనా’ను టార్పెడోలతో ముంచేసిన కొద్ది గంటలకే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. ఆ నౌక భారతదేశంలో జరిగిన ‘మిలాన్ 2026’ నేవల్ ఎక్సర్సైజ్ నుండి తిరిగి వస్తుండగా ఈ దాడి జరిగింది. ఈ ఘటనలో 100 మందికి పైగా సిబ్బంది మరణించి ఉండవచ్చని భావిస్తున్నారు. దీన్ని ఎటువంటి హెచ్చరిక లేని దాడిగా అభివర్ణించిన IRGC, ఇది ‘కంటికి కన్ను’ (ట్రిట్-ఫర్-టాట్) చర్య అని పేర్కొంది.
Also Read: సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నాన్సీ హత్య
IRGC చేసిన వాదనపై అమెరికా ఏమన్నది?
ఇప్పటివరకు ఈ దాడి గురించి అమెరికా నుండి ఎటువంటి అధికారిక ధృవీకరణ లేదు. గతంలో ఇరాన్ చేసిన ఇటువంటి వాదనలను అమెరికా ‘ఫేక్ న్యూస్’ అని కొట్టిపారేసింది. కానీ ఇప్పుడు జరుగుతున్న ఈ ఘటన నిజమైతే గల్ఫ్ ప్రాంతంలో నౌకాయానంపై భారీ ముప్పు పొంచి ఉంటుంది. ప్రపంచంలోని 20% చమురు సరఫరా స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ గుండానే జరుగుతుంది. ఇప్పటికే అక్కడ అనేక ట్యాంకర్లపై దాడులు జరిగాయి.
గతంలో కూడా ఇరాన్ తాము 3 అమెరికన్-బ్రిటిష్ ట్యాంకర్లను దెబ్బతీశామని, స్ట్రైట్‌ను ‘క్లోజ్’ చేశామని పేర్కొంది. అయితే అమెరికా మాత్రం ఇరాన్ నావికాదళాన్ని పూర్తిగా ధ్వంసం చేశామని చెబుతోంది. ‘సులేమానీ క్లాస్’ నౌకలతో సహా 20కిపైగా నౌకలను తాము ముంచేశామని అమెరికా పేర్కొంది. ఇరాన్ నావికాదళం ఇప్పుడు కేవలం ఒక ‘జ్ఞాపకం’ మాత్రమేనని సెంటామ్ స్పష్టం చేసింది.