Ceasefire : యుద్ధం ఆగినట్టేనా ? కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ ఓకే చెప్పిందా ?
Ceasefire : ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధం జరుగుతున్న వేళ కీలకమైన వార్త ఒకటి బయటికి వచ్చింది.
- By Pasha Published Date - 12:40 PM, Mon - 16 October 23
Ceasefire : ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధం జరుగుతున్న వేళ కీలకమైన వార్త ఒకటి బయటికి వచ్చింది. దక్షిణ గాజాలో తాత్కాలిక కాల్పుల విరమణకు, ఈజిప్టులోని రఫా బార్డర్ ను తెరిచి గాజాకు మానవతా సాయాన్ని పంపేందుకు ఇజ్రాయెల్ అంగీకరించిందంటూ రాయిటర్స్ ఒక సంచలన కథనాన్ని ప్రచురించింది. ఈజిప్టు రక్షణ శాఖ వర్గాలు ఈవిషయాన్ని తెలిపాయని ఆ కథనంలో ప్రస్తావించారు. ఈజిప్టు, అమెరికా దౌత్యంతో కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకరించిందని పేర్కొన్నారు. అయితే ఈ వార్తలను ఇజ్రాయెల్, హమాస్ రెండూ ఖండించాయి. ఇజ్రాయెల్ కాల్పుల విరమణపై తమకు సమాచారం లేదని హమాస్ మీడియా కార్యాలయం సోమవారం ఉదయం ప్రకటించింది. ఇక గాజాలోకి మానవతా సాయం వెళ్లేందుకు తాము ఇంకా అనుమతించలేదని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. కాల్పుల విరమణకు కూడా తాము అంగీకారం తెలపలేదని తేల్చి చెప్పింది.
We’re now on WhatsApp. Click to Join.
అమెరికా యూటర్న్.. ఇజ్రాయెల్ కు షాక్
మరోవైపు గాజాలో గ్రౌండ్ ఆపరేషన్ చేయొద్దని ఇజ్రాయెల్ కు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సూచించారు. అంతర్జాతీయ చట్టాలకు లోబడి యుద్ధం చేయాలని కోరారు. దీనిపై ఐక్యరాజ్యసమితిలోని ఇజ్రాయెల్ రాయబారి గిలాడ్ ఎర్డాన్ ఘాటుగా స్పందించారు. ఇజ్రాయెల్ లోని 2 మిలియన్ల పాలస్తీనియన్లను పాలించాలనే ఆసక్తి తమకు లేదని ఆయన స్పష్టం చేశారు. గాజాలోని ఉగ్రవాద గ్రూపును నాశనం చేయాల్సిన అవసరాన్ని అర్థం చేసుకున్నందుకు బైడెన్ కు ఎర్డాన్ కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు లెబనాన్ లోని హిజ్బుల్లా తరుచూ దాడులు చేస్తుండటంతో.. ఆ దేశం బార్డర్ లోని తమ 28 కాలనీలను ఇజ్రాయెల్ ఆర్మీ ఖాళీ చేయించింది. ప్రస్తుతం తమ ఫోకస్ గాజాపై మాత్రమే ఉందని (Ceasefire) వెల్లడించింది.