Ismail Haniyeh : ఔను.. ఇస్మాయిల్ హనియాను మేమే హత్య చేశాం : ఇజ్రాయెల్
పథకం ప్రకారమే ఇస్మాయిల్ హనియా(Ismail Haniyeh)ను ఇజ్రాయెల్ హత్య చేసిందని ఇరాన్ అప్పట్లోనే ఆరోపించింది.
- By Pasha Published Date - 08:57 AM, Tue - 24 December 24

Ismail Haniyeh : పాలస్తీనా మిలిటెంట్ సంస్థ ‘హమాస్’ అగ్రనేత ఇస్మాయిల్ హనియాను ఎవరు హత్య చేశారు ? ఈ ప్రశ్నకు సమాధానం దొరికింది. ఈ హత్య చేసింది తామేనని ఇజ్రాయెల్ ప్రభుత్వం ప్రకటించింది. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ ఈవిషయాన్ని అధికారికంగా వెల్లడించారు.
Also Read :Bank Holiday: బ్యాంకు కస్టమర్లకు బిగ్ అలర్ట్.. ఐదు రోజులపాటు బ్యాంకులు బంద్!
‘‘గత కొన్ని వారాలుగా ఇజ్రాయెల్‌పై యెమన్‌కు చెందిన హూతీ ఉగ్రవాదులు పెద్దఎత్తున మిస్సైళ్లతో దాడులు చేస్తున్నారు. వాళ్లకు నేను క్లియర్‌గా ఒక విషయాన్ని చెప్పాలని అనుకుంటున్నాను. మేం ఇప్పటికే హమాస్, హిజ్బుల్లాలను ఓడించాం. వారికి సంబంధించిన మౌలిక సదుపాయాల వ్యవస్థలను ధ్వంసం చేశాం. ఇరాన్‌కు చెందిన రక్షణ రంగ ఉత్పత్తి వ్యవస్థలను నాశనం చేశాం. సిరియాలో బషర్ అల్ అసద్ ప్రభుత్వాన్ని సైతం పడగొట్టాం. హనియా, సిన్వర్, నస్రల్లాలను హతమార్చాం. యెమన్‌లోని హూతీలకు కూడా మేం దెబ్బతీస్తాం’’ అని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ చెప్పారు. ఈ ఏడాది జులైలో ఇరాన్ రాజధాని తెహ్రాన్‌లో ఇస్మాయిల్ హనియా మర్డర్ జరిగింది. ఇరాన్ నూతన అధ్యక్షుడి ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు తెహ్రాన్‌కు హనియా వెళ్లారు. ఈక్రమంలో ఆయన బస చేసిన గదిపై డ్రోన్ దాడి జరిగింది. దీంతో ఆ గదిలోనే హనియా ప్రాణాలు విడిచారు. పథకం ప్రకారమే ఇస్మాయిల్ హనియా(Ismail Haniyeh)ను ఇజ్రాయెల్ హత్య చేసిందని ఇరాన్ అప్పట్లోనే ఆరోపించింది. అయితే ఆ సమయంలో దీనిపై ఇజ్రాయెల్ ఎలాంటి ప్రకటన చేయలేదు. హనియా హత్యతో తమకు సంబంధం లేదని ఆనాడు స్పష్టం చేసింది. ఇప్పుడు ఈవిషయాన్ని ధ్రువీకరించడం గమనార్హం.