ఇరాన్లో 3,428 మంది మృతి.. ట్రంప్ కీలక ప్రకటన!
యుద్ధ భయంతో మధ్యప్రాచ్యంలో హై అలర్ట్ ప్రకటించారు. బ్రిటన్ తన రాయబార కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసివేయగా జర్మనీకి చెందిన 'లుఫ్తాన్సా' విమానయాన సంస్థ ఇరాన్, ఇరాక్ మీదుగా విమాన ప్రయాణాలను రద్దు చేసింది.
- Author : Gopichand
Date : 15-01-2026 - 3:30 IST
Published By : Hashtagu Telugu Desk
Iran Protests: ఇరాన్లో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న తీవ్ర ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. నిరసనకారులపై జరుగుతున్న హత్యలు బుధవారం జరగాల్సిన భారీ ఉరిశిక్షలను ఇరాన్ ప్రభుత్వం నిలిపివేసిందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బుధవారం వైట్ హౌస్ వేదికగా ప్రకటించారు.
నిశితంగా గమనిస్తున్నాం: ట్రంప్
ఇరాన్‌లోని చాలా ముఖ్యమైన వర్గాల నుండి తనకు ఈ సమాచారం అందిందని ట్రంప్ తెలిపారు. “హత్యలు ఆగిపోయాయని, ఈరోజు జరగాల్సిన ఉరిశిక్షలు నిలిపివేశారని వారు నాకు హామీ ఇచ్చారు. ఇది ఎంతవరకు నిజమో మేము నిశితంగా గమనిస్తాం” అని ఆయన పేర్కొన్నారు. అయితే ఇరాన్‌పై తాము హెచ్చరించిన సైనిక చర్య ఇప్పుడే ఉపసంహరించుకోవడం లేదని, పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
Also Read: సంక్రాంతి శుభాకాంక్షలు 2026.. మీ స్నేహితులకు, బంధువులకు ఇలా స్పెషల్ కోట్స్, విషెస్‌తో చెప్పేయండి!
ఇరాన్ విదేశాంగ మంత్రి వివరణ
ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి ‘ఫాక్స్ న్యూస్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “ఈరోజు లేదా రేపు ఎటువంటి ఉరిశిక్షలు ఉండవు” అని ధృవీకరించారు. అయితే దేశంలో జరిగిన హింసకు ఇజ్రాయెల్, బాహ్య శక్తులే కారణమని ఆయన ఆరోపించారు. శాంతియుత నిరసనల్లోకి విదేశీ శక్తులు చొరబడి అమెరికాను యుద్ధానికి ప్రేరేపించడానికి ఈ గొడవలు సృష్టించాయని ఆయన వాదించారు.
మానవ హక్కుల సంఘాల నివేదికల ప్రకారం ఇరాన్ పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ఇప్పటివరకు కనీసం 3,428 మంది నిరసనకారులు మరణించారు. దాదాపు 10,000 మందికి పైగా అదుపులోకి తీసుకున్నారు. గత 144 గంటలుగా ఇరాన్లో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి.
అంతర్జాతీయ సమాజం స్పందన
ఇరాన్లో జరుగుతున్న అణచివేతపై G7 దేశాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. హింస ఆపకపోతే కఠిన ఆంక్షలు తప్పవని హెచ్చరించాయి. అమెరికా విజ్ఞప్తి మేరకు ఇరాన్ సంక్షోభంపై చర్చించేందుకు గురువారం భద్రతా మండలి అత్యవసరంగా సమావేశం కానుంది. ఇరాన్ అధికారులు అపూర్వమైన స్థాయిలో చట్టవిరుద్ధమైన హత్యలకు పాల్పడుతున్నారని మండిపడింది.
ప్రాంతీయ ప్రభావం
యుద్ధ భయంతో మధ్యప్రాచ్యంలో హై అలర్ట్ ప్రకటించారు. బ్రిటన్ తన రాయబార కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసివేయగా జర్మనీకి చెందిన ‘లుఫ్తాన్సా’ విమానయాన సంస్థ ఇరాన్, ఇరాక్ మీదుగా విమాన ప్రయాణాలను రద్దు చేసింది. తమపై దాడి జరిగితే తగిన రీతిలో బుద్ధి చెబుతామని ఇరాన్ సీనియర్ సలహాదారులు హెచ్చరించారు.