Iran Vs Mossad : ‘‘మా గూఢచార సంస్థలో ఇజ్రాయెల్ ఏజెంట్లు’’.. ఇరాన్ మాజీ అధ్యక్షుడి సంచలన కామెంట్స్
ఈ తరుణంలో సీఎన్‌ఎన్ తుర్క్ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇరాన్ మాజీ అధ్యక్షుడు అహ్మదీ నెజాద్ (Iran Vs Mossad) సంచలన కామెంట్స్ చేశారు.
- By Pasha Published Date - 02:24 PM, Tue - 1 October 24

Iran Vs Mossad : ఇరాన్ మద్దతు కలిగిన లెబనాన్ మిలిటెంట్ సంస్థ హిజ్బుల్లా చతికిలపడింది. దాని చీఫ్ హసన్ నస్రల్లాను ఇజ్రాయెల్ పక్కా ప్లాన్ ప్రకారం హతమార్చింది. హసన్ నస్రల్లా ఆచూకీ చెప్పింది మరెవరో కాదు.. లెబనాన్ రాజధాని బీరుట్‌లో ఉన్న ఒక ఇరాన్ గూఢచారే అని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ తరుణంలో సీఎన్‌ఎన్ తుర్క్ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇరాన్ మాజీ అధ్యక్షుడు అహ్మదీ నెజాద్ (Iran Vs Mossad) సంచలన కామెంట్స్ చేశారు.
Also Read :Religious Structures : రోడ్లను ఆక్రమించి నిర్మించిన మత కట్టడాలను తొలగించాలి : సుప్రీంకోర్టు
ఏకంగా ఇరాన్ ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఇంటెలిజెన్స్ విభాగం అధిపతే ఇజ్రాయెల్ నిఘా సంస్థ మోసాద్ చేతిలో కీలుబొమ్మగా మారాడని అహ్మదీ నెజాద్ ఆరోపించారు. అతడి మోసం వల్లే ఇరాన్ మద్దతు కలిగిన మిలిటెంట్ సంస్థలకు నష్టం జరుగుతోందని వాపోయారు. ఇరాన్‌లో మోసాద్ మూలాలు ఎంత బలంగా ఉన్నాయో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చని నెజాద్ పేర్కొన్నారు. ‘‘మా దేశ నిఘా సంస్థ అధిపతే మోసాద్ గూఢచారి అనే విషయం 2021 సంవత్సరంలో బయటపడింది’’ అని ఆయన చెప్పారు. ఇరానే కాదు చాలా దేశాల నిఘా విభాగాలు, గూఢచార విభాగాల అధిపతులు ఇజ్రాయెల్ చెప్పుచేతల్లో ఉన్నారని ఆయన ఆరోపించారు. ఇరాన్‌కు సంబంధించిన అత్యంత ముఖ్యమైన అణ్వాయుధ తయారీ సీక్రెట్లను కూడా సాక్షాత్తూ ఇరాన్ ఇంటెలీజెన్స్ అధికారులే మోసాద్‌కు అందించారని చెప్పారు. దాదాపు ఇరవై మంది ఇరాన్ గూఢచార విభాగం సిబ్బంది ఇజ్రాయెల్ కోసం పనిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్ గడ్డపై మోసాద్ కార్యకలాపాలు చాలా పెరిగిపోవడం అనేది దేశ భద్రతకు ఆందోళన కలిగించే అంశమన్నారు.
Also Read :Dussehra Holidays 2024 : ఏపీలో అక్టోబరు 3 నుంచి దసరా సెలవులు
ఇరాన్ నిర్వహిస్తున్న అణ్వాయుధ తయారీ ప్రయోగాలకు సంబంధించిన లక్ష పేజీల రిపోర్టును ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మోసాద్ గతంలో సేకరించింది. అందుకోసం కూడా ఇరాన్ నిఘా విభాగంలోని తమ మనుషులను మోసాద్ వాడుకుందని అంటున్నారు. ఇరాన్ రాజధాని తెహ్రాన్‌లోని రహస్య సైనిక స్థావరంలోకి దాదాపు 20 మందికిపైగా మోసాద్ మనుషులు ప్రవేశించి ఆ రిపోర్టును దొంగిలించారని అప్పట్లో అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ఆనాడు చోటుచేసుకున్న ఆ ఘటన వల్లే అణ్వాయుధాల తయారీ కార్యక్రమంలో ఇరాన్ వెనుకంజలో ఉండిపోయిందని పరిశీలకులు అంటున్నారు.