Dussehra Holidays 2024 : ఏపీలో అక్టోబరు 3 నుంచి దసరా సెలవులు
దీని ప్రకారమే ఏపీలోని అన్ని ప్రైవేటు, ప్రభుత్వ స్కూళ్లకు దసరా సెలవులు (Dussehra Holidays 2024) ఇవ్వనున్నారు.
- By Pasha Published Date - 12:25 PM, Tue - 1 October 24

Dussehra Holidays 2024 : దసరా సెలవులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అక్టోబరు 3 (గురువారం) నుంచి 13 (ఆదివారం) వరకు దసరా సెలవులు ఉంటాయని వెల్లడించింది. అంటే ఈసారి ఏపీ విద్యార్థులకు 10 రోజుల పాటు దసరా సెలవులు వస్తున్నాయన్న మాట. ఈనెల 14న స్కూళ్లు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. దీని ప్రకారమే ఏపీలోని అన్ని ప్రైవేటు, ప్రభుత్వ స్కూళ్లకు దసరా సెలవులు (Dussehra Holidays 2024) ఇవ్వనున్నారు. అక్టోబర్ 3 నుంచి దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు కూడా మొదలవుతాయి. అక్టోబర్ 12న విజయదశమి పండుగతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. తొమ్మిరోజుల పాటు వివిధ రూపాలలో భక్తులకు అమ్మవారు దర్శనమిస్తారు. ఇక అక్టోబరు నెలలోని ఇతర సెలవుల విషయానికి వస్తే.. ఈనెల 2న గాంధీ జయంతి వేడుకలు జరుగుతాయి. అక్టోబర్ 20న ఆదివారం, అక్టోబర్ 27న ఆదివారం ఉంది. అక్టోబర్ 31న దీపావళి పండుగ ఉంది. అక్టోబర్ నెలలో పాఠశాలలకు ఈసారి దాదాపు 16 సెలవులు వస్తుండటం గమనార్హం. అంటే ఈనెలలో పాఠశాలలు పని చేసేది 14 రోజులు మాత్రమే. ఈలెక్కన అక్టోబరు నెల అనేది విద్యార్ధులకు పండుగ అనే చెప్పుకోవాలి. వరుస సెలవులతో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల విద్యార్థులకు మంచి విశ్రాంతి లభించనుంది. ఈ సమయంలో విద్యార్థులు ఫోన్లకు హత్తుకు పోకుండా.. ఇతరత్రా ఉపయోగకర యాక్టివిటీస్ వైపు మరల్చాల్సిన బాధ్యత పేరెంట్స్‌పై ఉంది.
Also Read :Nandyala : నంద్యాలలో పట్టాలు తప్పిన రైలు.. ఏమైందంటే..
ఇక తెలంగాణ రాష్ట్రంలో దసరా సెలవులు అక్టోబర్ 2 నుంచి 14 వరకు ఉన్నాయి. దీనిపై ఇప్పటికే తెలంగాణ సర్కారు ప్రకటన చేసింది. ఈనెల 15 నుంచి తెలంగాణలో స్కూళ్లు తిరిగి మొదలవుతాయి. రాష్ట్రంలో ఎంగిలి బతుకమ్మ పండుగను అక్టోబర్ 2న నిర్వహించనున్నారు. ఆ తరువాత దుర్గాష్టమి రోజున సద్దుల బతుకమ్మతో ఈ సంబురాలు ముగుస్తాయి. దసరా పండుగకు రెండు రోజుల ముందు సద్దుల బతుకమ్మ పండుగను ప్రజలు సెలబ్రేట్ చేసుకోనున్నారు.