China Youth: వామ్మో.. పెళ్లా.. పెళ్లి వద్దంటున్న చైనా యువకులు, కారణమిదే
గృహహింస కేసుల పరంపర నేపథ్యంలో చైనాలోని యువకులు పెళ్లి చేసుకోవడానికి భయపడుతున్నారు.
- Author : Balu J
Date : 04-07-2023 - 3:22 IST
Published By : Hashtagu Telugu Desk
గృహహింస కేసుల పరంపర నేపథ్యంలో చైనాలోని యువకులు పెళ్లి చేసుకోవడానికి భయపడుతున్నారు. ఇలాంటి హింసాత్మక వివాహాలు అవసరమా? వంటి ప్రశ్నలు యువతలో తలెత్తుతున్నాయని చైనా మీడియా కథనం వెల్లడించింది. తాజాగా షాన్‌డాంగ్ ప్రావిన్స్‌లో భార్యను భర్త దారుణంగా హతమార్చిన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. షాన్‌డాంగ్ ప్రావిన్స్‌లో ఓ భర్త తన భార్యను దారుణంగా హత్య చేశాడు. భార్యపై కారుతో పలుమార్లు దాడి చేశాడు. బాధితురాలు బతికే ఉందని తెలిసి మళ్లీ కారును ఆమెపైకి విసిరేశాడు.
ఈ ఘటనకు సంబంధించిన వార్త చైనా అంతటా వ్యాపించింది. అందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. కుటుంబ కలహాల కారణంగా 37 ఏళ్ల భర్త 38 ఏళ్ల భార్యను దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. ఈ సంఘటనకు ముందు, చైనాలో మరో రెండు గృహ హింస కేసులు జాతీయ దృష్టిని ఆకర్షించాయి. ఈ ఘటనల్లో నిందితులు ప్రదర్శించిన క్రూరత్వం ప్రతిచోటా ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది.
గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లో ఓ వ్యక్తి తన భార్యతో పాటు మరొకరిని దారుణంగా కత్తితో పొడిచాడు. ఈ ఘటనలో కొన్నాళ్లుగా గృహహింసతో బాధపడుతున్న మహిళ విడాకులు కావాలని కోరింది. ఈ క్రమంలో భర్తపై దాడి చేశాడు. చెంగ్డూ ప్రావిన్స్‌లో కూడా ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. విడాకులు కోరిన భార్యపై భర్త దాడి చేశాడు. ఈ ఘటనలో బాధితురాలు ఎనిమిది రోజుల పాటు ఐసీయూలో ఉండాల్సి వచ్చింది. రెండేళ్ల వివాహ సమయంలో భర్త తనపై 16 సార్లు దాడికి పాల్పడ్డాడని బాధితురాలు సోషల్ మీడియాలో పేర్కొంది. ఈ సంఘటనలు చైనీస్ ప్రజలకు పెళ్లి గురించి అనేక ప్రశ్నలను మిగిల్చాయని చైనా మీడియా ప్రచురించింది. పెళ్లికి యువత భయపడుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయని వెల్లడించారు.