Iran : ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన కెనడా
అమెరికా మిత్రదేశం కెనడా సంచలన నిర్ణయం తీసుకుంది.
- By Pasha Published Date - 02:48 PM, Thu - 20 June 24

Iran : అమెరికా మిత్రదేశం కెనడా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇరాన్ ప్రభుత్వానికి చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) దళాన్ని తీవ్రవాద సంస్థల జాబితాలో చేర్చింది. ఉగ్రవాదంపై పోరాటంలో భాగంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని కెనడా వెల్లడించింది. ‘‘IRGCని మేం ఇక ఉగ్రవాద సంస్థగా పరిగణిస్తాం. దాన్ని ఎదుర్కోవడానికి మా దగ్గరున్న అన్ని సాధనాలను ఉపయోగిస్తాం’’ అని స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో ఇకపై ఇరాన్ ఆర్మీ అధికారులు కెనడాలోకి ప్రవేశించలేరు. వారికి కెనడా దేశ తలుపులు మూసుకుపోయాయి. రానున్న రోజుల్లో తమ దేశంలో ఉన్న ఇరాన్ ప్రభుత్వ అధికారులను కెనడా ప్రభుత్వ సంస్థలు విచారణ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు ఇరాన్‌లోని కెనడియన్లు ఏకపక్ష నిర్బంధానికి గురయ్యే రిస్క్ ఉందని కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇరాన్‌లో ఉన్న కెనడియన్లు స్వదేశానికి తిరిగి వచ్చేయాలని ఆమె పిలుపునిచ్చారు. తమ దేశం నుంచి ఇకపై ఎవరూ ఇరాన్‌కు వెళ్లొద్దని మెలానీ జోలీ కోరారు.
We’re now on WhatsApp. Click to Join
కెనడా నిర్ణయంపై ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి నాసర్ కనానీ స్పందిస్తూ.. ‘‘కెనడా దేశం అవివేకమైన నిర్ణయం తీసుకుంది. ఇలాంటి నిర్ణయాలు సరికావు’’ అని తెలిపారు. కెనడా నిర్ణయం వల్ల తమ దేశంపై పెద్దగా ప్రభావమేం పడదని ఆయన తేల్చి చెప్పారు. ఇప్పటికే 2019 సంవత్సరంలో IRGCని తీవ్రవాద సంస్థగా అమెరికా గుర్తించింది. ఇప్పుడు అమెరికా మిత్రదేశం కెనడా కూడా అదే బాటలో పయనించింది.
Also Read :65 Percent Reservations : 65 శాతం రిజర్వేషన్లు రద్దు.. హైకోర్టు సంచలన తీర్పు
ఏమిటీ ఐఆర్‌జీసీ ?
- IRGC(Irans Revolutionary Guards) అనేది ఇరాన్‌లో ప్రధాన సైనిక, రాజకీయ, ఆర్థిక శక్తి. ఈ సైనిక విభాగాన్ని నేరుగా ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ నిర్వహిస్తుంటారు.
- ఇరాన్ యొక్క వ్యూహాత్మక ఆయుధాలను పర్యవేక్షించే బాధ్యతను ఐఆర్‌జీసీ నిర్వర్తిస్తుంటుంది.
- ఇరాన్‌కు చెందిన ఐఆర్‌జీసీలో దాదాపు 1.90 లక్షల మందికిపైగా యాక్టివ్ సిబ్బంది ఉన్నారు. వీరంతా ఇరాన్ ఆర్మీకి చెందిన భూ బలగాలు, నౌకాదళం, వైమానిక దళంలో పనిచేస్తుంటారు.
- IRGCకి చెందిన ఖుద్స్ (జెరూసలేం) ఫోర్స్ అనేది తమ మిత్రదేశాలకు ఆయుధాలు, డబ్బు, సాంకేతికత, శిక్షణ, సలహాలను అందిస్తుంటుంది.
- 2020 జనవరిలో IRGC క్షిపణి దాడిలో కెనడాకు చెందిన PS752 విమానం కూల్చివేతకు గురైంది. ఆ ఘటనలో 175 మంది విమాన ప్రయాణికులు మరణించారు. వీరిలో 55 మంది కెనడియన్ పౌరులు, 30 మంది కెనడా శాశ్వత నివాసితులు ఉన్నారు.