Martial Law Chaos : దక్షిణ కొరియాలో ‘ఎమర్జెన్సీ’ కలకలం.. దేశాధ్యక్షుడు ఏం చేయబోతున్నారంటే..
‘ఎమర్జెన్సీ మార్షల్ లా’ (Martial Law Chaos) ప్రకటించిన వెంటనే ఆర్మీ రంగంలోకి దిగింది.
- By Pasha Published Date - 10:31 AM, Wed - 4 December 24

Martial Law Chaos : దక్షిణ కొరియాలో రాజకీయ సంక్షోభం తీవ్రరూపు దాలుస్తోంది. దేశాధ్యక్షుడు యూన్ సుక్ యోల్ మంగళవారం సాయంత్రం ‘ఎమర్జెన్సీ మార్షల్ లా’ విధించారు. ప్రతిపక్షాలు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని ఆరోపిస్తూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. దక్షిణ కొరియాలో ఉంటున్న ఉత్తరకొరియా అనుకూల శక్తులను ఏరివేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నానని యూన్ సుక్ యోల్ ప్రకటించారు. ‘ఎమర్జెన్సీ మార్షల్ లా’ (Martial Law Chaos) ప్రకటించిన వెంటనే ఆర్మీ రంగంలోకి దిగింది. పార్లమెంటు సమావేశాలు, రాజకీయ సమావేశాలు నిర్వహించరాదని వెల్లడించింది. దేశాధ్యక్షుడి సంచలన నిర్ణయంతో దక్షిణ కొరియా ప్రజలు, రాజకీయ వర్గాల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది.దేశ పార్లమెంట్ ఎదుట ప్రజలు భారీ సంఖ్యలో నిరసనకు దిగారు. ఈక్రమంలో భద్రతా బలగాలు, నిరసనకారుల మధ్య ఘర్షణ జరిగింది.
Also Read :Earthquake : తెలంగాణ, ఏపీలలో భూప్రకంపనలు.. ఇళ్ల నుంచి బయటకు జనం పరుగులు
దేశాధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌కు సొంత పార్టీ నుంచి కూడా వ్యతిరేకత ఎదురైంది. దీంతో మంగళవారం అర్ధరాత్రి ఆయన ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేశారు. ‘మార్షల్ లా’ అమలును వ్యతిరేకిస్తూ పార్లమెంట్‌లో ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించారు. దక్షిణకొరియా పార్లమెంట్‌లోని మొత్తం 300 మంది సభ్యులకుగానూ 190 మంది ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. మార్షల్ లా అమలు చట్టవిరుద్ధం అని పేర్కొంటూ స్పీకర్ ప్రకటన విడుదల చేశారు. దీంతో తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు అధ్యక్షుడు యూన్ మళ్లీ ప్రకటించారు. ఎట్టకేలకు ఇవాళ (బుధవారం) తెల్లవారుజామున 4.30 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) దక్షిణ కొరియాలో ఎమర్జెన్సీని ఎత్తివేశారు. 1980 తర్వాత ఈ దేశంలో మళ్లీ ఇప్పుడు మార్షల్ లా విధించారు. తాజా పరిణామాల నేపథ్యంలో దేశ అధ్యక్ష పదవికి యూన్ రాజీనామా చేస్తారని తెలుస్తోంది. అందుకే బుధవారం తన షెడ్యూల్‌ను ఆయన రద్దు చేసుకున్నారని సమాచారం. ఆయన తన రాజీనామాపై ఇంకొన్ని గంటల్లో ప్రకటన చేస్తారనే టాక్ వినిపిస్తోంది.