Earthquake : తెలంగాణ, ఏపీలలో భూప్రకంపనలు.. ఇళ్ల నుంచి బయటకు జనం పరుగులు
తెలంగాణలోని ములుగు జిల్లా మేడారంలో భూకంప కేంద్రాన్ని(Earthquake) గుర్తించారు.
- Author : Pasha
Date : 04-12-2024 - 9:21 IST
Published By : Hashtagu Telugu Desk
Earthquake : ఇవాళ ఉదయం తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో భూకంపం వచ్చింది. ఉదయం 7 గంటల 27 నిమిషాలకు దాదాపు 3 నుంచి 4సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో జనం భయపడి ఇళ్లు, అపార్ట్‌మెంట్‌ల నుంచి బయటకు పరుగులు తీశారు. తెలంగాణలోని ములుగు జిల్లా మేడారంలో భూకంప కేంద్రాన్ని(Earthquake) గుర్తించారు. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.3గా నమోదైంది. ఈ మేరకు హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్-ఎన్‌జీఆర్ శాస్త్రవేత్తలు ఒక ప్రకటన విడుదల చేశారు. భూకంప కేంద్రం నుంచి 225 కి.మీ దూరం వరకు విస్తరించి ఉన్న ప్రాంతాలలో భూ ప్రకంపనల ప్రభావం కనిపించింది.
Also Read :CM Revanth Reddy : నేడు పెద్దపల్లిలో సీఎం రేవంత్ పర్యటన.. జిల్లాపై నిధుల వర్షం
తెలంగాణలో.. హైదరాబాద్‌లోని పలు ఏరియాలు, ఉమ్మడి ఖమ్మం, రంగారెడ్డి, వరంగల్, కరీంనగర్ జిల్లాల పరిధిలో పలుచోట్ల భూప్రకంపనలను ఫీలయ్యామని జనం చెప్పారు. హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురం, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్ పరిసర ప్రాంతాల్లో భూకంపం వచ్చింది. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో వరంగల్ సిటీ, హన్మకొండ సిటీ, ములుగులలో ప్రజలు భూకంపాన్ని ఫీలయ్యారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం, చర్ల, చింతకాని, నాగులవంచ, ఇల్లెందులలో స్వల్ప భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని.. విజయవాడ, విశాఖపట్నం, జగ్గయ్యపేట, నందిగామ, ఏలూరు సహా పలు ప్రాంతాల్లోనూ భూకంపం చోటుచేసుకుంది.