Bangladesh Army Coup: భారత్ మిత్రదేశంలో బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్.. సైనిక తిరుగుబాటు తప్పదా ?
మహ్మద్ యూనుస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి, బంగ్లాదేశ్(Bangladesh Army Coup) సైన్యానికి మధ్య ప్రస్తుతం చాాలా గ్యాప్ ఉంది.
- By Pasha Published Date - 09:53 AM, Thu - 22 May 25

Bangladesh Army Coup: బంగ్లాదేశ్‌లో లెక్కలు మారుతున్నాయి. భారత్‌పై విషం కక్కుతున్న తాత్కాలిక ప్రభుత్వ అధినేత మహ్మద్ యూనుస్ పీఠానికి ఎసరు తెచ్చేందుకు బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ రెడీ అవుతున్నారు. రష్యా వేదికగా ఇందుకు రంగం సిద్దమైందని సమాచారం. ఏప్రిల్ నెల మొదటి వారంలో భారత్ మిత్రదేశం రష్యాలో బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వకారుజ్జమాన్ పర్యటించారు. ఆయన రష్యా డిప్యూటీ డిఫెన్స్ మినిస్టర్ జనరల్ ఫోమిన్, ఆర్మీ చీఫ్ జనరల్ ఒలేగ్ సల్యుకోవ్, రక్షణ సంస్థలు రోస్టెక్, రోసోబోరో నెక్స్పోర్ట్, రోసాటమ్ ప్రతినిధులను కలిశారు. రక్షణ రంగంలో రష్యా సహకారాన్ని బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ కోరారు. త్వరలో బంగ్లాదేశ్‌లో జరగబోయే సైనిక తిరుగుబాటుకు ఈ పర్యటన ఒక ఏర్పాటు లాంటిదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
Also Read :Terrorists Encounter: కశ్మీర్‌లో నలుగురు ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్.. ? పాక్ మరో ప్లాన్!
యూనుస్ సర్కారుతో పెరిగిన గ్యాప్
మహ్మద్ యూనుస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి, బంగ్లాదేశ్(Bangladesh Army Coup) సైన్యానికి మధ్య ప్రస్తుతం చాాలా గ్యాప్ ఉంది. బంగ్లాదేశ్ సైన్యం నిర్ణయాలను యూనుస్ సర్కారు ఎప్పటికప్పుడు వ్యతిరేకిస్తోంది. వాటిని తప్పుపడుతోంది. మహ్మద్ యూనుస్ మద్దతుదారులు, విద్యార్థి సంఘాలు ఢాకా వీధుల్లో నిరసనలకు దిగుతున్నారు. ఈ నిరసనలను బంగ్లాదేశ్ ఆర్మీ ఎక్కడికక్కడ అణచివేస్తోంది. మే 20న బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఉన్న మాటీకాటా ఏరియాలో పెద్దఎత్తున ఆయుధ సామగ్రిని ఆర్మీ సీజ్ చేసింది. దీనిపై స్వయంగా బంగ్లాదేశ్ ఆర్మీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ ఆయుధ సామగ్రితో లింకులున్న హిట్లు బాబు గ్యాంగు సభ్యులను అరెస్టు చేసినట్లు వెల్లడించింది. యూనుస్ సర్కారు మాఫియాలు, ముఠాలు, గ్యాంగులను రెచ్చగొట్టి బంగ్లాదేశ్ ఆర్మీపైకి ఉసిగొల్పుతోందనే ప్రచారం జరుగుతోంది. హిట్లు బాబు గ్యాంగు మే 20న ఢాకాలోని బంగ్లాదేశ్ ఆర్మీ క్యాంపుపై దాడికి యత్నించడమే ఇందుకు పెద్ద నిదర్శనం.
Also Read :Samantha : సమంత స్పీచ్.. అక్కినేని అమల చప్పట్లు.. వీడియో వైరల్
షేక్ హసీనాకు అనుకూలంగా ఆర్మీ చీఫ్
వీలైనంత త్వరగా దేశంలో ఎన్నికలు నిర్వహించాలని బంగ్లాదేశ్ ఆర్మీకి ఉన్నప్పటికీ.. అందుకు యూనుస్ సర్కారు మోకాలు అడ్డుపెడుతోంది. బంగ్లాదేశ్‌లో ప్రస్తుతమున్న ఏకైక అతిపెద్ద రాజకీయ పార్టీ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) కూడా ఆర్మీకి వ్యతిరేకంగా మాట్లాడుతోంది. ఢాకా నార్త్ సిటీ కార్పొరేషన్ పాలకుడిగా మహ్మద్ అజాజ్‌ను నియమించడంపై బీఎన్‌పీ అగ్రనేతలు భగ్గుమంటున్నారు. బంగ్లాదేశ్‌లోని రాజకీయ పక్షాలు, తాత్కాలిక ప్రభుత్వం నుంచి ఆ దేశ ఆర్మీకి ఎదురవుతున్న వ్యతిరేకతకు ఈ పరిణామాలే సాక్ష్యాలు. అందుకే సైనిక తిరుగుబాటు చేయాలని బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వకారుజ్జమాన్ భావిస్తున్నారట. సైనిక తిరుగుబాటు చేశాక తన ఆధ్వర్యంలో బంగ్లాదేశ్‌లో ఎన్నికలను నిర్వహించాలని అనుకుంటున్నారట. ప్రస్తుతం భారత్‌లో ఉన్న మాజీ ప్రధాని షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీకి కూడా సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేసే అవకాశాన్ని కల్పించాలని ఆయన యోచిస్తున్నారట.