Nigeria: నైజీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 70 మంది సజీవ దహనం
నార్త్ సెంటర్‌లోని నైజర్ రాష్ట్రంలోని సులేజా ప్రాంతానికి సమీపంలో శనివారం ఉదయం ట్యాంకర్‌లో మంటలు చెలరేగడంతో ప్రజల్లో భయాందోళన వాతావరణం నెలకొంది.
- By Gopichand Published Date - 09:14 AM, Sun - 19 January 25

Nigeria: నైజీరియా దేశంలో (Nigeria) భారీ అగ్నిప్రమాదం జరిగింది. గ్యాసోలిన్ నింపిన ట్యాంకర్‌లో అకస్మాత్తుగా పేలుడు సంభవించడంతో భారీ మంటలు చెలరేగాయి. ఇందులో 70 మంది సజీవదహనమయ్యారు. క్షతగాత్రులను ఆస్పత్రిలో చేర్పించారు. నేషనల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ చీఫ్ హుస్సేనీ ఈసా అగ్ని ప్రమాదాన్ని ధృవీకరించారు. ఇంధనం తరలిస్తున్న సమయంలో ప్రమాదం జరిగిందని ఆయన చెప్పారు.
నార్త్ సెంటర్‌లోని నైజర్ రాష్ట్రంలోని సులేజా ప్రాంతానికి సమీపంలో శనివారం ఉదయం ట్యాంకర్‌లో మంటలు చెలరేగడంతో ప్రజల్లో భయాందోళన వాతావరణం నెలకొంది. కొందరు వ్యక్తులు జనరేటర్‌తో ఒక ట్యాంకర్ నుంచి మరో ట్యాంకర్‌కు గ్యాసోలిన్‌ను తరలించేందుకు ప్రయత్నిస్తుండగా ట్యాంకర్ పేలి మంటలు చెలరేగాయి. ఈ కారణంగా పెట్రోల్ బదిలీ చేయడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తులు సజీవ దహనమయ్యారు. మంటలు సమీపంలోని ప్రజలను కూడా చుట్టుముట్టాయి. భారీ అగ్నిప్రమాదం చూసి ఆ ప్రాంతంలో భయాందోళన నెలకొంది.
Also Read: Kho Kho World Cup: ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత పురుషుల, మహిళల ఖో- ఖో జట్లు!
ప్రమాదంపై విచారణకు గవర్నర్ ఆదేశించారు
ప్రమాదంపై నైజర్ గవర్నర్ మహమ్మద్ బాగో స్పందించారు. నైజర్ రాష్ట్రంలోని డిక్కో ప్రాంతంలో గ్యాసోలిన్ ట్యాంకర్ నుండి ఇంధనాన్ని దొంగిలించే ప్రయత్నం జరుగుతోందని, అకస్మాత్తుగా పేలుడు సంభవించిందని ఆయన చెప్పారు. పేలుడు తర్వాత మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో దాదాపు 70 మంది చనిపోయారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వచ్చి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. దీంతో అక్కడికక్కడే చెలరేగిన గందరగోళాన్ని పోలీసులు అదుపు చేశారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పడంలో సఫలమయ్యారు అని ఆయన వివరించారు.
మంటలు ఆర్పివేయడంతో పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. గాయపడిన వారిని కూడా సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే ప్రభుత్వ అధికారులు, పోలీసు శాఖ అధికారులు ప్రమాద స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. రెస్క్యూ ఆపరేషన్‌ను విజయవంతం చేసిన వారిని కొనియాడుతూ ప్రమాదానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.
నైజీరియాలో పెట్రోల్ ట్యాంకర్లలో పేలుళ్లు సర్వసాధారణమని తెలిసిందే. అప్పుడప్పుడు ట్యాంకర్ పేలుడు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. సెప్టెంబర్ 2024లో కూడా పెట్రోలు నింపిన ట్యాంకర్ హైవేపై పేలి 48 మంది చనిపోయారు. నైజీరియా అధ్యక్షుడు బోలా టినుబు కూడా ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు.