Soraha Village : ఊరిని చీకటి చేసిన దొంగలు
Soraha Village : గ్రామంలో 250 కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్ చోరీ అయిన సంఘటనను డిసెంబర్ 15వ తేదీన గ్రామస్థులు గుర్తించారు
- By Sudheer Published Date - 03:54 PM, Tue - 7 January 25

ఎక్కడైన దొంగలు (Thieves) నగదు దోచుకోవడం, బంగారం దోచుకోవడం లేదా వాహనాలు దొంగతనం చేయడం చూస్తుంటాం. కానీ ఇక్కడ ఏకంగా కరెంటు అందించే ట్రాన్స్‌ఫార్మర్ (Transformer)నే దొంగతనం (Theft)చేసి ఊరినే చీకట్లో ఉంచారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
Delhi Election Schedule : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఎప్పుడంటే..!!
బుడౌన్ జిల్లాలోని సోరాహా గ్రామం (Soraha Village)లో 5 వేలకు పైగా జనాభా నివసిస్తారు. అయితే ఆ గ్రామంలో 250 కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్ చోరీ అయిన సంఘటనను డిసెంబర్ 15వ తేదీన గ్రామస్థులు గుర్తించారు. ఆ ట్రాన్స్‌ఫార్మర్‌లోని రాగి వైర్లు, ఆయిల్, ఇతర విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు. దీంతో ఆ గ్రామస్థులు ఉగైటీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నా.. కొత్త ట్రాన్స్‌ఫార్మర్ మాత్రం బిగించలేదు. రోజులు గడుస్తున్నా కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయకపోవడంతో గత 20 రోజులుగా గ్రామస్థులు చీకట్లోనే ఉంటున్నారు.
వచ్చే నెలలో ఉత్తర్‌ప్రదేశ్ బోర్డు పరీక్షలు జరగనున్నాయని.. కరెంటు లేకపోవడంతో ఇన్వర్టర్లు, సెల్‌ఫోన్లు, కనీసం తాగు నీటి బోర్లు కూడా పనిచేయడం లేదని గ్రామస్థులు వాపోతున్నారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని ఎన్నోసార్లు విద్యుత్ శాఖ, జిల్లా అధికారులకు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో గ్రామంలో కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేసేవరకు తాత్కాలికంగా సహాయం అందించేందుకు విద్యుత్ శాఖ చర్యలు చేపట్టిందని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నరేంద్ర చౌదరి తెలిపారు. సమీప గ్రామం నుంచి విద్యుత్ సరఫరా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.