Mt Kilimanjaro: కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన ఐదేళ్ల బుడ్డోడు
కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించాడు ఐదేళ్ల బుడ్డోడు తేగ్‌బీర్ సింగ్. తేగ్బీర్ ఆగష్టు 18న ఆరోహణను ప్రారంభించి, ఆగస్టు 23న పర్వతం యొక్క ఎత్తైన శిఖరం అయిన ఉహురు శిఖరాన్ని చేరుకున్నాడు. ఉహురు శిఖరం వద్ద మైనస్ 10 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.
- By Praveen Aluthuru Published Date - 02:55 PM, Tue - 27 August 24

Mt Kilimanjaro: పంజాబ్‌లోని రోపర్‌లో నివసిస్తున్న ఐదేళ్ల తేగ్‌బీర్ సింగ్ చరిత్ర సృష్టించాడు. తేగ్‌బీర్ సింగ్ టాంజానియాలో ఉన్న ఆఫ్రికాలోని ఎత్తైన శిఖరం కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. తేగ్‌బీర్ సింగ్ అధిరోహణ తర్వాత కిలిమంజారో నేషనల్ పార్క్‌తో సహా టాంజానియా నేషనల్ పార్క్స్ కన్జర్వేషన్ కమిషనర్ జారీ చేసిన పర్వతారోహణ ధృవీకరణ పత్రాన్ని అందుకున్నారు.
తేగ్బీర్ ఆగష్టు 18న ఆరోహణను ప్రారంభించి, ఆగస్టు 23న పర్వతం యొక్క ఎత్తైన శిఖరం అయిన ఉహురు శిఖరాన్ని చేరుకున్నాడు. ఉహురు శిఖరం వద్ద మైనస్ 10 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. పైకి వెళుతున్నా కొద్దీ అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని చెప్తున్నారు. అయినప్పటికీ 5 ఏళ్ల తేగ్బీర్ అన్ని సవాళ్లను అధిగమించి శిఖరాన్ని చేరుకోవాలనే తన కలను నెరవేర్చుకున్నాడు. తేగ్బీర్ మౌంట్ కిలిమంజారోను జయించడం ద్వారా అతను 6 ఆగస్టు 2023న సెర్బియాకు చెందిన ఓగ్జెన్ సివ్‌కోవిక్ పేరిట ఉన్న ఐదేళ్ల వయసులో కిలిమంజారో పర్వతాన్ని జయించిన ప్రపంచ రికార్డును సమం చేశాడు.
తేగ్బీర్ తన కోచ్, రిటైర్డ్ హ్యాండ్‌బాల్ కోచ్ బిక్రమ్‌జిత్ సింగ్ ఘుమాన్ మరియు కుటుంబ సభ్యులకు తన విజయాన్ని అందించాడు. కాగా ఈ ఐదేళ్ల చిన్నారి ఆగస్టు 30న భారత్‌కు తిరిగి రానున్నారు.ఇక ఈ విజయంపై పంజాబ్ డీజీపీ తెగ్బీర్‌ను అభినందించారు. కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన అతి పిన్న వయస్కుడైన ఆసియా వ్యక్తిగా నిలిచాడని తెలిపారు. అతని విజయాలు ఇతరులను తమ పరిమితులను దాటి గొప్పతనాన్ని సాధించేలా ప్రేరేపిస్తాయని పేర్కొన్నారు.
Also Read: BJP : ఈనెల 30న బీజేపీలో చేరుతున్నా..చంపాయ్ సోరెన్