Amit Shah : పాక్‌కు వెళ్లాల్సిన నీళ్లను మళ్లిస్తాం..దాయాది గొంతు ఎండాల్సిందే: అమిత్ షా
భారత్‌కి సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేసే హక్కు ఉంది. అదే చేశాం కూడా. అంతర్జాతీయ ఒప్పందాలను ఏకపక్షంగా రద్దు చేయలేం, కానీ మౌలిక నిబంధనలు పాక్షికంగా ధ్వంసమైతే, ఆ ఒప్పందం అమలును నిలిపివేయడం సహజం.
- By Latha Suma Published Date - 11:52 AM, Sat - 21 June 25

Amit Shah : భారత్–పాకిస్తాన్ మధ్య 1960లో కుదిరిన సింధూ నదీ జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించే ప్రసక్తే లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఈ ఒప్పంద నిబంధనలను పాకిస్తాన్ మళ్లి మళ్లీ ఉల్లంఘిస్తోందని, ఇన్నాళ్లూ అన్యాయంగా నీటిని వాడుకున్న దాయాది దేశం ఇక నీటి కొరతతో అల్లాడక తప్పదని ఆయన హెచ్చరించారు. ఒక ప్రముఖ జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అమిత్ షా మాట్లాడుతూ..భారత్‌కి సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేసే హక్కు ఉంది. అదే చేశాం కూడా. అంతర్జాతీయ ఒప్పందాలను ఏకపక్షంగా రద్దు చేయలేం, కానీ మౌలిక నిబంధనలు పాక్షికంగా ధ్వంసమైతే, ఆ ఒప్పందం అమలును నిలిపివేయడం సహజం. ఈ ఒప్పందం ప్రధాన ఉద్దేశం శాంతి, పరస్పర అభివృద్ధి. కానీ పాక్ నిరంతరం ఉగ్రవాదానికి ప్రోత్సహన ఇస్తూ, దాన్ని ఉల్లంఘిస్తోంది అని పేర్కొన్నారు.
Read Also: Yogandhra 2025 : యోగాంధ్ర గ్రాండ్ సక్సెస్
పాకిస్థాన్‌కి ఇప్పటివరకు అక్రమంగా సాగిన నీటి సరఫరాను భారత ప్రభుత్వం పూర్తిగా అడ్డుకునే చర్యలు చేపట్టింది. సింధూ నుంచి పాకిస్థాన్‌కి వెళ్లే నీటిని ఎలాంటి నష్టమూ లేకుండా రాజస్థాన్, పంజాబ్ వంటి రాష్ట్రాలకు మళ్లించేలా కెనాల్ ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని చెప్పారు. ఇది నీటిపై పాక్ ఆధారాన్ని ఛిన్నాభిన్నం చేస్తుంది. ఇకపై ఆ దేశానికి బూడిదే మిగులుతుంది అని అన్నారు. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి అనంతరం భారత్ ఈ ఒప్పందాన్ని అమలులోంచి తొలగించింది. పాకిస్థాన్‌కు ఇది తీవ్రమైన దెబ్బగానే కాక, భవిష్యత్‌లో ఆ దేశ వ్యవసాయ, ఆర్థిక వ్యవస్థలపై తీవ్రమైన ప్రభావం చూపనుంది. ఇప్పటికీ పాక్ వ్యవసాయానికి వాడే నీటిలో సుమారు 80 శాతం సింధూ జలాల నుంచే వస్తోంది. పైగా, దేశ జీడీపీలో 25 శాతం వాటా ఈ నదులపైనే ఆధారపడుతుంది.
అమిత్ షా మరో కీలక విషయాన్ని ప్రస్తావించారు. నియోజకవర్గాల పునర్విభజనపై ఎటువంటి అన్యాయం జరగదని, అన్ని ప్రాంతాల సమస్యలను సమగ్రంగా పరిగణనలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. 2026లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయని డీఎంకే ఈ ప్రతిపాదనకు వ్యతిరేకత చూపుతోంది. కానీ ప్రజలకు అన్యాయం జరగకుండా, సమతుల్యంగా పునర్విభజన చేపడతాం అని వివరించారు. అలాగే, మహిళా రిజర్వేషన్ల అంశంపై మాట్లాడుతూ 2029 లోక్‌సభ ఎన్నికలు 33 శాతం మహిళా రిజర్వేషన్ల ప్రకారం నిర్వహిస్తాం. ఇప్పటికే పార్లమెంట్ ఆమోదించిన ఈ బిల్లు మహిళల రాజకీయ ప్రాతినిధ్యాన్ని విస్తృతంగా పెంచుతుంది అని స్పష్టం చేశారు.