America : విద్యాశాఖ మంత్రిగా లిండాను నియమించిన..ట్రంప్..ఎవరీ లిండా మెక్‌మాన్ ?
లిండా మెక్‌మాన్ తల్లిదండ్రుల హక్కుల కోసం పోరాడే బలమైన న్యాయవాది అని ట్రంప్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దేశంలో విద్యను బలోపేతం చేస్తామని, ఈ ప్రయత్నానికి లిండా నాయకత్వం వహిస్తారని ట్రంప్ అన్నారు.
- By Latha Suma Published Date - 02:09 PM, Wed - 20 November 24

Education Minister : అమెరికాలో ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ అమెరికా దేశాధ్యక్షుడిగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన తన టీమ్‌ను రెడీ చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే చాలా వరకు నియామకాలు ట్రంప్ పూర్తి చేశారు. ఇప్పుడు తాజాగా వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ (డబ్ల్యుడబ్ల్యుఇ) మాజీ సిఇఒ లిండా మెక్‌మాన్‌కను విద్యాశాఖ మంత్రిగా నామినేట్ చేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. లిండా మెక్‌మాన్ తల్లిదండ్రుల హక్కుల కోసం పోరాడే బలమైన న్యాయవాది అని ట్రంప్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దేశంలో విద్యను బలోపేతం చేస్తామని, ఈ ప్రయత్నానికి లిండా నాయకత్వం వహిస్తారని ట్రంప్ అన్నారు.
ఇకపోతే..ట్రంప్ తొలిసారి అమెరికా అధ్యక్షుడిగా వ్యవహరించిన సమయంలో మెక్‌మాన్ 2017 నుంచి 2019 వరకు ఎస్‌బీఏ అధిపతిగా పనిచేశారు. రాజకీయాల్లోకి రావడానికి ముందు తన భర్త మెక్‌మాన్‌తో కలిసి క్యాపిటల్ రెజ్లింగ్, వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ (డబ్ల్యూడబ్ల్యూఈ)ని స్థాపించారు. 2010లో కనెక్టికట్ నుంచి యూఎస్ సెనేట్‌కు రిపబ్లికన్ నామినీగా మెక్‌మాన్ పోటీ చేశారు. డెమొక్రాటిక్ అభ్యర్ధి రిచర్డ్ బ్లూమెంటల్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఎన్నికల్లో పరాజయం పాలైనప్పటికీ. అమెరికా ఫస్ట్ పాలసీ ఇన్‌స్టిట్యూట్ బోర్డ్‌కు అధ్యక్షురాలిగా లిండా పనిచేశారు.
2024 ఎన్నికల్లో ట్రంప్ విజయంలో కీలకపాత్ర పోషించిన ఆమె బిలియనీర్ హోవార్డ్ లుట్నిక్‌తో కలిసి పనిచేసింది. ఇటీవల మిల్వాకీలో జరిగిన రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్ సందర్భంగా ట్రంప్‌పై ప్రశంసల వర్షం కురిపించింది. ఆయన ఉద్యోగ సృష్టికర్త అని..అమెరికన్ కార్మికులకు బెస్ట్ ఫ్రెండ్ అని లిండా మెక్‌మాన్ పేర్కొన్నారు. ప్రస్తుతం లిండా ట్రంప్ రాజకీయ పరివర్తన బృందం సభ్యురాలిగా ఉన్నారు. ఈ బృందం ప్రభుత్వంలో సుమారు 4,000 స్థానాలను భర్తీ చేస్తుంది. జనవరిలో ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న విషయం తెలిసిందే.