MLC Elections : ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల..
11న నామినేష్ల పరిశీలన, 13న సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉన్నది. ఆ తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలను ప్రకటిస్తారు. 27న పోలింగ్ జరుగుతుంది.
- By Latha Suma Published Date - 11:33 AM, Mon - 3 February 25

MLC Elections : తెలంగాణలో రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 10వ తేదీ వరకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామపత్రాలను దాఖలు చేయవచ్చు. ఇక, వెంటనే నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభమైంది. 11న నామినేష్ల పరిశీలన, 13న సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉన్నది. ఆ తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలను ప్రకటిస్తారు. 27న పోలింగ్ జరుగుతుంది. వచ్చేనెల 3న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే.
నామినేషన్ ప్రక్రియ: ఫిబ్రవరి 3 నుంచి 10 వరకు
నామినేషన్ల పరిశీలన: ఫిబ్రవరి 11
నామినేషన్ల ఉపసంహరణకు గడువు: ఫిబ్రవరి 13
పోలింగ్: ఫిబ్రవరి 27 (ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు)
ఫలితాలు: మార్చి 3
ఉమ్మడి ఖమ్మం-వరంగల్-నల్లగొండ ఉపాధ్యాయ స్థానానికి సంబంధించిన నామినేషన్లను నల్లగొండ కలెక్టరేట్‌లో స్వీకరిస్తారు. మూడు ఉమ్మడి జిల్లాల్లో మొత్తం 12 కొత్త జిల్లాలున్నాయి. 24,905 మంది ఓటర్లుండగా.. 191 మండలాల్లో 200 పోలింగ్‌స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఉమ్మడి కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలో 3,41,313 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో ముగ్గురు థర్డ్ జెండర్లు కూడా ఉన్నారు. అదేవిధంగా ఉపాధ్యాయ ఓటర్లు 25,921 మంది ఉన్నారు. నాలుగు ఉమ్మడి జిల్లాల్లో పట్టభద్రుల కోసం 499, ఉపాధ్యాయ ఓటర్లకు 274 చొప్పున పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.
కాగా, ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ, కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లా పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీల స్థానాలు ఖాళీ అవనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎన్నికల అధికారులుగా నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి, కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి వ్యవహరిస్తారు.
Read Also: Cyberabad Traffic Pulse : హైదరాబాద్ వాహనదారుల ట్రాఫిక్ కష్టాలను తీర్చే కొత్త మార్గం