PM Modi : ఉమ్మడి స్ఫూర్తితో టీబీ రహిత భారత్ కోసం పోరాడుదాం : ప్రధాని మోడీ
PM Modi : అంకితభావం, వినూత్న రీతిలో ప్రయత్నాల ఫలితంగానే దేశంలో టీబీ తగ్గుదలకు కారణమని ప్రధాని మోడీ అన్నారు. అయితే ఇకపై కూడా ఉమ్మడి స్ఫూర్తి తో టీబీ రహిత భారత్ కోసం పోరాడతామని అన్నారు.
- By Latha Suma Published Date - 07:20 PM, Sun - 3 November 24

TB Prevention : టీబీ నివారణలో భారత్ సాధించిన అద్భుతమైన పురోగతిని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిందంటూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. అయితే ఈ పోస్టు పై ప్రధాని మోడీ స్పందించారు. టీబీ (క్షయ) నివారణ విషయంలో అద్భుతమైన పురోగతి సాధించామని ప్రధాని మోడీ తెలిపారు. టీబీ రహిత భారతదేశాన్ని ఆవిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తూనే ఉంటామని ఆయన వెల్లడించారు. అంకితభావం, వినూత్న రీతిలో ప్రయత్నాల ఫలితంగానే దేశంలో టీబీ తగ్గుదలకు కారణమని ప్రధాని మోడీ అన్నారు. అయితే ఇకపై కూడా ఉమ్మడి స్ఫూర్తి తో టీబీ రహిత భారత్ కోసం పోరాడతామని అన్నారు.
మరోవైపు దేశంలో 2015 నుంచి 2023 మధ్య కాలంలో టీబీ వ్యాప్తి రేటు 17.7 శాతం మేర తగ్గిందని జేపీ నడ్డా పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా టీబీ తగ్గుదల రేటు 8.3 శాతం ఉండగా భారత్లో రెట్టింపు ఫలితం ఉందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో తమ ప్రభుత్వం ‘ని-క్షయ్ పోషణ్ యోజన’ వంటి కీలకమైన కార్యక్రమాలను చేపడుతోందని, తద్వారా జాతీయ టీబీ నిర్మూలన కార్యక్రమాన్ని విస్తరించిందని నడ్డా ప్రస్తావించారు. ఇక మల్టీ-డ్రగ్ రెసిస్టెంట్ ట్యూబర్క్యులోసిస్ చికిత్స కోసం కొత్తగా ‘బీపీఏఎల్ఎం డ్రగ్ కోర్స్’ ని ప్రవేశపెట్టామని పేర్కొన్నారు. క్షయవ్యాధిపై జరుగుతున్న పోరాటంలో నిబద్ధతతో కీలక పాత్ర పోషిస్తున్న ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆరోగ్య కార్యకర్తల అవిశ్రాంత ప్రయత్నాలను తాను గుర్తిస్తున్నట్టు నడ్డా చెప్పారు.