KTR : తెలంగాణలో శాంతి భద్రతలపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
KTR : రాష్ట్రంలో శాంతిభద్రతలు తీవ్ర ఆందోళనకరంగా మారాయని.. పూర్తిస్థాయి హోం మంత్రి లేకపోవడంతో శాంతిభద్రతలు కుంటుపడ్డాయన్నారు. పోలీసులు రాజకీయ వ్యవహారాల్లో బిజీగా మారిపోయారని ఇకకైనా పోలీసులు శాంతిభద్రతల పై దృష్టి సారించాలన్నారు.
- By Latha Suma Published Date - 06:16 PM, Tue - 22 October 24
Law and order in Telangana : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణలో శాంతి భద్రతలపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవని గత కొన్ని నెలలుగా మేం చెప్తున్న మాటలే ఈరోజు కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చెప్పారని తెలిపారు. జగిత్యాలలో తన అనుచరుడు గంగిరెడ్డి హత్య సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎక్స్ వేదికగా కేటీఆర్ మంగళవారం స్పందించారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు తీవ్ర ఆందోళనకరంగా మారాయని.. పూర్తిస్థాయి హోం మంత్రి లేకపోవడంతో శాంతిభద్రతలు కుంటుపడ్డాయన్నారు. పోలీసులు రాజకీయ వ్యవహారాల్లో బిజీగా మారిపోయారని ఇకకైనా పోలీసులు శాంతిభద్రతల పై దృష్టి సారించాలన్నారు. రాజకీయ పెద్దలు విజ్ఞతతో ఆలోచించి రాష్ట్రంలో శాంతి, సామరస్యాన్ని కాపాడేందుకు సమర్థులైన పోలీసు అధికారులకు స్వేచ్ఛ ఇస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
కాగా, తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ముఖ్య అనుచరుడు గంగారెడ్డి దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ హత్యను నిరసిస్తూ జీవన్ రెడ్డి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సొంత ప్రభుత్వంపైనే ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ కార్యకర్తలకే భరోసా లేదని ఆయన అన్నారు. తాను ఎవరికీ భరోసా ఇచ్చే స్థితిలో లేనని చెప్పారు.