G7 Summit : కెనడా ఆతిథ్యమిస్తున్న 51వ జీ7 సదస్సుకు భారత్‌కు ఆహ్వానం: ప్రధాని మోడీ
మార్క్ కార్నేతో ఫోన్‌లో మాట్లాడటం తనకు ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయవంతంగా ప్రధాని పదవిని చేపట్టిన కార్నేకు శుభాకాంక్షలు తెలియజేశారు.
- By Latha Suma Published Date - 07:46 PM, Fri - 6 June 25

G7 Summit : ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకు కెనడాలోని అల్బెర్టాలో జరగనున్న 51వ జీ7 (G7 Summit) శిఖరాగ్ర సమావేశానికి భారత్‌కు అధికారిక ఆహ్వానం అందింది. ఈ నేపథ్యంలో, కెనడా కొత్త ప్రధాని మార్క్ కార్నే భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఫోన్ చేసి, ఈ అంతర్జాతీయ సదస్సులో పాల్గొనాలని ఆహ్వానించారు. ఈ విషయం ప్రధాని మోడీ స్వయంగా తన అధికారిక ఎక్స్ (మాజీ ట్విట్టర్) ఖాతాలో తెలిపారు. మార్క్ కార్నేతో ఫోన్‌లో మాట్లాడటం తనకు ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయవంతంగా ప్రధాని పదవిని చేపట్టిన కార్నేకు శుభాకాంక్షలు తెలియజేశారు.
Read Also: CM Revanth Reddy : అభివృద్ధి పథంలో తెలంగాణ : సీఎం రేవంత్ రెడ్డి
ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. భారత్, కెనడా శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశాలు. పరస్పర గౌరవం, పరస్పర ప్రయోజనాల దృష్ట్యా మేము కలిసి పనిచేయాలన్న దృక్పథం ఉంది అని అన్నారు. అలాగే, మార్క్ కార్నేతో కలిసి పని చేయడానికి ఎదురు చూస్తున్నట్టు వెల్లడించారు. గతంలో భారత్ జీ7 సభ్యదేశం కాకపోయినా, నిర్వహణ దేశాల ఆహ్వానంతో పలుమార్లు ఈ సమావేశాల్లో పాల్గొంది. గత ఏడాది ఇటలీలో జరిగిన జీ7 సమావేశానికి కూడా భారత్ హాజరై, ఆఫ్రికా, దక్షిణ అమెరికా, ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలతో కలిసి తన పాత్రను పోషించింది. ఆ సదస్సులో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ కూడా పాల్గొన్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, గ్లోబల్ ఎకనామిక్ అనిశ్చితి, ఆహార భద్రత వంటి అంశాలపై ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు.
ఈసారి కెనడాలో జరిగే జీ7 సదస్సు కూడా అంతర్జాతీయంగా కీలకంగా మారనుంది. వాతావరణ మార్పులు, ఆర్థిక అసమానతలు, టెక్నాలజీ వృద్ధి, భద్రతాపరమైన వంటి కీలక అంశాలు చర్చకు వస్తాయని అంచనా. భారతదేశం తరఫున ప్రధాని మోడీ హాజరవడంవల్ల అభివృద్ధి చెందుతున్న దేశాల గొంతు వినిపించనుంది. ఇలాంటి ప్లాట్‌ఫారమ్‌లు, భారత్‌కు ప్రపంచ స్థాయిలో తన అభిప్రాయాలను వ్యక్తపరిచే అవకాశాన్ని కల్పిస్తాయి. జీ7 వేదికపై మోడీ పాల్గొనబోతుండటంతో, అంతర్జాతీయ రాజకీయాల్లో భారత్ పాత్ర మరింత బలపడే అవకాశముంది. ఈ సందర్బంగా, భారత్-కెనడా సంబంధాలు గత కొంతకాలంగా కొంత ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ, కొత్త నాయకత్వం ఆశాజనకంగా మారాలని నిపుణులు భావిస్తున్నారు. పారస్పరిక అభివృద్ధికి, ప్రజాస్వామ్య విలువల పటిష్టతకు ఇది ఒక చక్కటి అవకాశం అని విశ్లేషకులు అంటున్నారు.