Elon Musk : ఆ బిల్లును ఆమోదిస్తే.. రేపే కొత్త పార్టీ .. ట్రంప్‌కు ఎలాన్ మస్క్ షాక్
ఈ బిల్లుకు ఆమోదం లభిస్తే వెంటనే కొత్త రాజకీయ పార్టీని ప్రారంభిస్తానని ఆయన గట్టిగా హెచ్చరించారు. ఈ బిల్లును మస్క్ ఏకంగా "పిచ్చి బిల్లు"గా అభివర్ణించారు. అమెరికా అప్పు పరిమితిని 5 ట్రిలియన్ డాలర్ల వరకూ పెంచేలా ఈ బిల్లులో ప్రస్తావించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.
- By Latha Suma Published Date - 10:17 AM, Tue - 1 July 25

Elon Musk : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రవేశపెట్టిన “వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్” పై టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ వ్యతిరేకత మరింత ముదిరింది. మొదటినుంచి ఈ బిల్లును తీవ్రంగా విమర్శిస్తున్న మస్క్, తాజాగా మరోసారి ఎక్స్ వేదికగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ బిల్లుకు ఆమోదం లభిస్తే వెంటనే కొత్త రాజకీయ పార్టీని ప్రారంభిస్తానని ఆయన గట్టిగా హెచ్చరించారు. ఈ బిల్లును మస్క్ ఏకంగా “పిచ్చి బిల్లు”గా అభివర్ణించారు. అమెరికా అప్పు పరిమితిని 5 ట్రిలియన్ డాలర్ల వరకూ పెంచేలా ఈ బిల్లులో ప్రస్తావించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. సామాజిక సంక్షేమ కార్యక్రమాల్ని కత్తిరిస్తూ, ప్రజలపై మరింత రుణభారం మోపే విధంగా రూపొందించబడిన ఈ బిల్లుకు మద్దతిచ్చే చట్టసభ సభ్యులు తమ పదవులను వదలాలని డిమాండ్ చేశారు.
Read Also: Commercial Gas : కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్
ఇది ప్రజల అభిప్రాయానికి విరుద్ధమైన బిల్లు. దీని వల్ల ప్రభుత్వ వ్యయం తగ్గడం కాదు, గానీ పన్ను దారుల భారం పెరుగుతుంది. ఇది పూర్తిగా కార్పొరేట్ లాభాలకే అనుకూలంగా ఉంది. ప్రజల అవసరాల్ని పక్కన పెట్టిన ఈ విధానం దేశాన్ని ఆర్థిక సంక్షోభ వైపు నెట్టేస్తుంది అని మస్క్ స్పష్టం చేశారు. సెనెట్ ఇటీవలే ఈ బిల్లుకు ఆమోదం తెలపడంతో, మస్క్ ఆగ్రహం పెరిగినట్టు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా ఇప్పుడు ఒక కొత్త రాజకీయ వైఖరి కోసం ఎదురు చూస్తోంది. డెమోక్రట్స్, రిపబ్లికన్స్ రెండూ ఒకే మాలకు చుట్టిన తలలు. ప్రజలకి నిజమైన ప్రత్యామ్నాయం కావాలి అని వ్యాఖ్యానించారు.
తన కొత్త పార్టీ పేరును కూడా వెల్లడించారు. “ది అమెరికా పార్టీ.” ఈ పార్టీ ప్రజల గొంతుకగా నిలవబోతుందనీ, దేశ రాజకీయాల్లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతుందనీ ఆయన పేర్కొన్నారు. ఈ బిల్లు ఆమోదం పొందిన వెంటనే, మరుసటిరోజే మా కొత్త పార్టీని ప్రారంభిస్తాను. ఇక మౌనం చాలు. ప్రజల కోసం రాజకీయాల్లోకి దిగాల్సిన సమయం వచ్చేసింది అని తేల్చి చెప్పారు. ఎలాన్ మస్క్ వ్యాఖ్యలతో అమెరికా రాజకీయాల్లో చర్చలు వేడెక్కుతున్నాయి. ఇప్పటికే ఆయన విమర్శలు సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం పొందుతున్నాయి. ట్రంప్ ప్రభుత్వ విధానాలపై ఆయన ఇటీవలి కాలంలో తరచూ దూకుడు చూపుతుండగా, ఈసారి మాత్రం రాజకీయ రంగ ప్రవేశానికి పునాదులు వేస్తున్న సూచనలూ కనిపిస్తున్నాయి.