CM Revanth Reddy : నవంబరు 1న మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు శంకుస్థాపన: సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy : మూసీ ప్రాజెక్టు పనులపై ప్రతిపక్షాలతో చర్చలకు సిద్ధమన్నారు. త్వరలో అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నట్టు సీఎం తెలిపారు. ''బీఆర్‌ఎస్ నేతలు మూసీ పునరుజ్జీవంపై అభ్యంతరాలను తెలియజేయాలి. నన్ను కలవడానికి అభ్యంతరమైతే మంత్రులు, అధికారులను కలిసి అభ్యంతరాలు చెప్పొచ్చు.
- By Latha Suma Published Date - 04:57 PM, Tue - 29 October 24

Musi Renaissance Project : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సచివాలయంలో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నవంబరు 1న మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేయనున్నట్టు ప్రకటించారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుపై ముందడుగు వేయడమే తప్ప.. వెనక్కి తగ్గే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందే వెయ్యి సార్లు ఆలోచిస్తామని.. తీసుకున్నాక వెనక్కి వెళ్లేది లేదన్నారు. తొలుత బాపూఘాట్ నుంచి పనులు ప్రారంభించనున్నట్లు చెప్పారు. నవంబర్ లోపు ప్రాజెక్టు పనులకు టెండర్లు పిలుస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
మూసీ ప్రాజెక్టు పనులపై ప్రతిపక్షాలతో చర్చలకు సిద్ధమన్నారు. త్వరలో అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నట్టు సీఎం తెలిపారు. ”బీఆర్‌ఎస్ నేతలు మూసీ పునరుజ్జీవంపై అభ్యంతరాలను తెలియజేయాలి. నన్ను కలవడానికి అభ్యంతరమైతే మంత్రులు, అధికారులను కలిసి అభ్యంతరాలు చెప్పొచ్చు. బాపూఘాట్ నుంచి వెనక్కి 21 కి.మీ అభివృద్ధి చేస్తాం. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, విద్యుత్ కొనుగోళ్లపై విచారణ జరుగుతోంది. విచారణ సమయంలో కక్ష సాధింపు ఉండదు. దర్యాప్తు సంస్థల నివేదికల ఆధారంగానే చర్యలు ఉంటాయి” అని సీఎం వివరించారు.
ఇకపోతే..తెలంగాణ ప్రభుత్వం మూసీ నది పునరుజ్జీవన కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన విమర్శలు ఎంత ఉండినా, ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో, నదుల పునరుజ్జీవనంపై అధ్యయనం చేసేందుకు మంత్రులు, ప్రజా ప్రతినిధులు, మరియు అధికారులతో కూడిన బృందం దక్షిణ కొరియాకు వెళ్లింది. నాలుగు రోజుల పర్యటనలో ఈ బృందం సియోల్‌లోని నదుల శుభ్రతను పరిశీలించి, అక్కడ మురుగునీటి శుద్ధీకరణ పద్ధతులపై విశ్లేషణ చేసింది.