Lagacharla incident : గతంలో రైతులకు సంకెళ్లు వేసిన వారికి పట్టిన గతే మీకు పడుతుంది: ఈటల
బాధితులపై థర్ట్ డిగ్రీ ప్రయోగించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ వారే స్కెచ్ వేసి దాడులు చేశారని ఆరోపించారు.
- By Latha Suma Published Date - 01:59 PM, Mon - 18 November 24

Eatala Rajendar : బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సంగారెడ్డి జైలులో వున్న లగచర్ల ఘటనలో అరెస్ట్ అయిన వారినీ పరామర్శించారు. ఈటల రాజేందర్‌తో పాటు డీకే అరుణ ఐదుగురు బీజేపీ నేతలు అరెస్టు అయిన 16 మంది లగచర్ల బాధితులతో ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ దాడి ఘటనలో ఏం జరిగిందో బాధితుల అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో ఈటల మాట్లాడుతూ..లగచర్ల బాధితులకు ప్రభుత్వం భేషరతుగా క్షమాపణలు చెప్పి వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బాధితులపై థర్ట్ డిగ్రీ ప్రయోగించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ వారే స్కెచ్ వేసి దాడులు చేశారని ఆరోపించారు.
కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్లుగా వెనుకబడిన కొడంగల్ ను అభివృద్ధి చేస్తారనుని రేవంత్ రెడ్డికి ఓట్లేస్తే తరతరాలుగా సాగు చేసుకుంటున్న తమ భూములను లాక్కుంటున్నారని ధ్వజమెత్తారు. వందల మంది పోలీసులతో దుర్మార్గంగా ప్రజలను భయభ్రాంతులను గురి చేయడమే కాకుండా గొడ్డును కొట్టినట్లుగా కొట్టారని ఆరోపించారు. తమ భూములు ఇవ్వమని ప్రజాస్వామిక పద్దతుల్లో నిరసన తెరుపుతుంటే సీఎం తలపెట్టిన ప్రాజెక్టు ఆగిపోతే రేవంత్ రెడ్డి పరువు పోతుందని కాంగ్రెస్ వాళ్లే కుట్రపూరితంగా దాడులు చేశారని, దాడులను అడ్డం పెట్టుకుని స్థానికులను భయపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ సోదరుడు అరాచకాలు నియోజకవర్గంలో ఎక్కువ అయ్యాయని ఆరోపించారు. 144 సెక్షన్ పెట్టి ప్రజాప్రతినిధులను అక్కడికి వెళ్లకుండా ఆపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ లో ప్రివిలేజ్ మోషన్ వేస్తామన్నారు. నియంతలకు సందర్భం వచ్చినప్పుడు తెలంగాణ సమాజం బుద్ధి చెబుతుందన్నారు.
మరోవైపు మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ.. ప్రజల కంటే సీఎం రేవంత్‌రెడ్డికి ఫార్మా కంపెనీలే ముఖ్యమా అని ప్రశ్నించారు. తమ భూములు ఇవ్వబోమంటూ గత 8 నెలలుగా రైతులు ఆందోళన చేస్తున్నారని తెలిపారు. బలవంతంగా భూములు లాక్కుంటామంటే రైతులు ఆగ్రహించారని అన్నారు. లగచర్ల దాడిని ముమ్మాటికీ కాంగ్రెస్ వాళ్లే చేయించారని బాధిత రైతులను వెంటనే విడుదల చేయాలని డీకే అరుణ డిమాండ్ చేశారు.