Eco Friendly Experience Park : ఎకో టూరిజాన్ని ప్రోత్సహిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
అన్ని సహజ వనరులు ఉన్న తెలంగాణలో మాత్రం గత ప్రభుత్వాలు దృష్టి పెట్టలేదని చెప్పారు. ఎకో టూరిజంపై ఇటీవలే అసెంబ్లీలో చర్చించామన్న ఆయన పర్యాటక పాలసీ తీసుకువచ్చి ఎకో టూరిజాన్ని ప్రోత్సహిస్తామని చెప్పారు.
- By Latha Suma Published Date - 03:14 PM, Tue - 28 January 25

Eco Friendly Experience Park : రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలంలోని పొద్దుటూరులో ఎకో ఫ్రెండ్లీ ఎక్సీపీరియం పార్కును సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రముఖ సినీనటుడు చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. ప్రపంచస్థాయి ప్రమాణాలతో 150 ఎకరాల్లో ఈ పార్కును ఏర్పాటు చేశారు. దీనిలో 25వేల జాతుల మొక్కలు ఉన్నాయి. 1500 మంది కూర్చునేలా యాంఫీ థియేటర్ ఏర్పాటు చేశారు.
ఎకో ఫ్రెండ్లీ ఎక్సీపీరియం పార్కు ప్రారంభోత్సవం కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. అటవీ ప్రాంతాల సందర్శనకు మధ్యప్రదేశ్, ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉందని అన్నారు. మందిరాల దర్శనాల కోసం తమిళనాడు, ఇతర ప్రాంతాలకు వెళ్తున్నామని, అన్ని సహజ వనరులు ఉన్న తెలంగాణలో మాత్రం గత ప్రభుత్వాలు దృష్టి పెట్టలేదని చెప్పారు. ఎకో టూరిజంపై ఇటీవలే అసెంబ్లీలో చర్చించామన్న ఆయన పర్యాటక పాలసీ తీసుకువచ్చి ఎకో టూరిజాన్ని ప్రోత్సహిస్తామని చెప్పారు.
ఈ సందర్భంగా సినీనటుడు చిరంజీవి మాట్లాడుతూ.. సీఎం రేవంత్ చాలా బిజీగా ఉన్నా ఈ పార్కు ఓపెనింగ్‌కు రావడం సంతోషమని పేర్కొన్నారు. ఇలాంటి పార్కులకు సీఎం రేవంత్ ప్రోత్సాహం అందించడం చాలా అభినందనీయమన్నారు. ఇంతటి అద్భుతమైన పార్కు ఏర్పాటు చేసిన రామ్ దేవ్ ఒక వ్యాపార వేత్త కాదని ఒక కళాకారుడని కొనియాడారు. అంతేకాకుండా దీనిని సినిమా షూటింగులకు ఇవ్వాలని, తన సినిమాను ఇందులో చేయాలని అనుకుంటున్నట్లు తన మనసులోని మాటను బయటపెట్టారు.
ఇటువంటి పార్క్‌ల వల్ల ఎంతో మందికి ఉపాధి, టూరిజం సైతం పెరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం సహకారం ఈ పార్కుకు మెండుగా ఉంటుందన ఆశాభావం వ్యక్తం చేశారు. ఎక్స్‌పీరియం పార్క్ అనేది బ్యూటిఫుల్ పీస్ ఆఫ్ ఆర్ట్ అని,అది తెలంగాణ, హైదారాబాద్ సిటీకి వన్నె తెస్తుందన్నారు. కాగా ఈ పార్క్‌ను రాందేవ్ రావు ఆరున్నర సంవత్సరాల పాటు శ్రమించి తీర్చిదిద్దారు. దీనిలో వివిధ ఆకృతుల్లో రాక్ గార్డెన్‌ను సిద్ధం చేశారు. 1500 మంది కూర్చునేలా యాంఫీ థియేటర్‌ను కూడా ఏర్పాటు చేశారు. రూ.150 కోట్ల విలువైన మొక్కలు, చెట్లు, వృక్షాలు కలిగిన ఏకైక టూరిస్టు ప్లేస్‌గా ఈ ఎక్స్ పీరియం పార్క్ నిలిచింది. ఇందులో 25 వేల జాతుల మొక్కలు ఉన్నాయి. 85 దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకున్న అరుదైన వృక్షాలు, చెట్లు ఉన్నాయి. ఎక్స్ పీరియం పార్కులో రూ.లక్ష నుంచి రూ.3.5 కోట్ల విలువ చేసే అరుదైన వృక్షాలను అందుబాటులో ఉంచారు.