Akhanda Godavari Project : డబుల్ ఇంజిన్ సర్కార్‌తో ఏపీలో అభివృద్ధి పరుగులు : కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్
ఇది అభివృద్ధి పథంలో దేశాన్ని ముందుకు నడిపించేలా ఉందని ఆయన స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం సమీపంలో ప్రారంభమైన అఖండ గోదావరి ప్రాజెక్టు రాష్ట్రానికి భారీ ప్రయోజనాలు కలిగించనుందని షెకావత్ అన్నారు.
- By Latha Suma Published Date - 01:01 PM, Thu - 26 June 25

Akhanda Godavari Project : రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన అనంతరం కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ప్రసంగించారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో దేశవ్యాప్తంగా అనేక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు జరుగుతున్నాయని తెలిపారు. ఇది అభివృద్ధి పథంలో దేశాన్ని ముందుకు నడిపించేలా ఉందని ఆయన స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం సమీపంలో ప్రారంభమైన అఖండ గోదావరి ప్రాజెక్టు రాష్ట్రానికి భారీ ప్రయోజనాలు కలిగించనుందని షెకావత్ అన్నారు. ఈ ప్రాజెక్టుతో గోదావరి నీటిని సమర్థంగా వినియోగించుకునే అవకాశం లభిస్తుంది. నీటి అవసరాలను తీర్చడమే కాకుండా, పర్యాటక రంగానికి ఇది భారీ ప్రోత్సాహంగా మారుతుంది అని పేర్కొన్నారు.
Read Also: Gut Health: జీర్ణవ్యవస్థ బలంగా ఉండాలంటే.. ఇలాంటి ఫుడ్ తీసుకోవాల్సిందే!
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ-జనసేన కూటమి కలసి పనిచేస్తున్నాయని మంత్రి అన్నారు. చంద్రబాబు నాయుడు దూరదృష్టితో ప్రాజెక్టుల రూపకల్పనలో ముందుండగా, పవన్ కల్యాణ్ రాష్ట్ర అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ఈ కలయికతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో వేగంగా సాగుతోంది అని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రధాని మోడీ నాయకత్వంలో భారత్‌లో పర్యాటక అభివృద్ధి చరిత్రాత్మక స్థాయికి చేరిందని షెకావత్ వ్యాఖ్యానించారు. ప్రపంచంలో అత్యధికంగా పర్యాటకుల రాక పెరిగిన దేశాల్లో భారత్ ముందు వరుసలో ఉంది. పర్యాటకానికి అనుకూల వాతావరణం కల్పించడంలో మోడీ సర్కార్ కీలక పాత్ర పోషిస్తోంది. ఆధ్యాత్మిక పర్యటనల కోసం కూడా విదేశీ పర్యాటకులు భారతదేశాన్ని ప్రాధాన్యత ఇస్తున్నారు అని వివరించారు.
ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధికి అనుకూలంగా మారుతోందని, ప్రకృతి సౌందర్యం, నదులు, ఆలయాల నేపథ్యంతో అంతర్జాతీయ స్థాయిలో ఆకర్షణీయంగా మారుతుందన్నారు. రాజమహేంద్రవరం ప్రాంతం గోదావరి అందాల గూటి. ఇది నదీ తీర పర్యటనలకు ప్రధాన కేంద్రంగా మారేందుకు అన్ని అవకాశాలున్నాయి అని ఆయన అన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్‌తో ఏపీలో అభివృద్ధి పరుగులు పెడుతోంది. టూరిజం అభివృద్ధికి ఏపీలో అనుకూల పరిస్థితులు ఉన్నాయి. ఆధ్యాత్మికంగానూ రాష్ట్రం అభివృద్ధి చెందుతోంది అని గజేంద్ర సింగ్ షెకావత్ చెప్పారు. రాష్ట్రం సమన్వయంతో అభివృద్ధి ప్రాజెక్టుల రూపకల్పన, అమలు స్పష్టంగా కనిపిస్తోంది. అఖండ గోదావరి ప్రాజెక్టుతో నీటి వనరుల వినియోగం, పర్యాటక అభివృద్ధి, ఆర్థికంగా రాష్ట్రం ముందడుగు వేసే అవకాశాలపై ప్రజల్లో ఆశావాహత నెలకొంది.
మరోవైపు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు, ఎంపీ పురందేశ్వరి మాట్లాడుతూ.. అమరావతి, పోలవరం ఇలా అన్నింటికీ కేంద్రం సహకారం అందిస్తోందని చెప్పారు. అనేక పర్యటక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసుకుంటున్నట్లు వివరించారు. చారిత్రక ప్రాధాన్యత గుర్తించి అభివృద్ధి చేసేందుకు కేంద్రం సాయమందిస్తోందని పురందేశ్వరి తెలిపారు. డబుల్ ఇంజిన్ సర్కారు ఉంటే అభివృద్ధి సాధ్యమని ఆనాడు చెప్పామని అన్నారు. ప్రజలు తమపై నమ్మకంతో ఆశీర్వదించి గెలిపించారని చెప్పారు. వికసిత్ భారత్‌లో వికసిత్ ఆంధ్రప్రదేశ్ ఒక భాగమని పేర్కొన్నారు.