Harish Rao : కార్మికుల సమ్మెకు బీఆర్ఎస్ మద్దతు: హరీశ్ రావు
పరిశ్రమలో 50 శాతం మంది కార్మికులు అంగీకరిస్తేనే యూనియన్ పెట్టాలని నిర్ణయం కార్మికుల గొంతు నొక్కడమే అన్నారు. బడా పారిశ్రామిక వేత్తలకు రూ.16 లక్షల 50 వేల కోట్లు మాఫీ చేసిన కేంద్ర ప్రభుత్వానికి కార్మికులకు రూ.16 వేల జీతం, రైతులకు రుణమాఫీ, కార్మికుల ఆరోగ్య భద్రత కల్పించమంటే మనసు రావడం లేదని మండిపడ్డారు.
- By Latha Suma Published Date - 06:50 PM, Sat - 19 April 25

Harish Rao : నేడు సిద్దిపేటలో కార్మిక సంఘాలు నిర్వహించిన సదస్సులో బీఆర్ఎస్ సీనియర్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మే 20వ తేదీన దేశవ్యాప్త కార్మికుల సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు స్పష్టం చేశారు. మొదటి నుంచి బీజేపీ కార్మిక వ్యతిరేక పార్టీ. బడా బాబులు, బడా పారిశ్రామిక వేత్తల పార్టీ అని హరీష్ రావు అన్నారు.
Read Also: Copper Vs Gold : ‘రాగి’ మరో ‘బంగారం’ కాగలదా ? అంత సీన్ ఉందా ?
పరిశ్రమలో 50 శాతం మంది కార్మికులు అంగీకరిస్తేనే యూనియన్ పెట్టాలని నిర్ణయం కార్మికుల గొంతు నొక్కడమే అన్నారు. బడా పారిశ్రామిక వేత్తలకు రూ.16 లక్షల 50 వేల కోట్లు మాఫీ చేసిన కేంద్ర ప్రభుత్వానికి కార్మికులకు రూ.16 వేల జీతం, రైతులకు రుణమాఫీ, కార్మికుల ఆరోగ్య భద్రత కల్పించమంటే మనసు రావడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో కనీసం ఆసుపత్రుల్లో కూడా మందులు అందుబాటులో లేవని ఆయన ఆరోపించారు. ఈఎస్ఐ ఆసుపత్రి పరిస్థితి మరింత దారుణంగా ఉందని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనతో ప్రజలు విసిగిపోయారని అన్నారు.
రైతులకు వ్యతిరేక 3 నల్ల చట్టాల పై అన్నదాతల పోరాటానికి కేంద్ర ప్రభుత్వం చట్టాల అమలును నిలిపివేసింది అన్నారు. అదే మాదిరిగా పోరాటానికి కార్మికులు పోరాటానికి సిద్దం కావాలని పిలుపునిచ్చారు. ఆశల, అంగన్ వాడీల వేతనాల పెంచుతామని ఇచ్చిన హామీని రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరిచిపోయాయని అన్నారు. కార్మికులకు వ్యతిరేకంగా కేంద్రం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్స్ ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సదస్సులో భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్, నాయకులు మంచె నర్సింలు, పిండి అరవింద్, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి గోపాల స్వామి, సీపీఎం జిల్లా కార్యదర్శి అముదాల మల్లారెడ్డి, ఎఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి బాల్ రాజు, సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్ కార్మిక సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.