APPSC : షెడ్యూల్డ్ కులాల అభ్యర్థులకు ఏపీపీఎస్సీ కీలక ప్రకటన
దీనిలో భాగంగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3గా ఈ రెండు వర్గాలను విభజించి, ఈ కొత్త వర్గీకరణ ఏప్రిల్ 19, 2025 నుంచి అధికారికంగా అమలులోకి వస్తుందని సాధారణ పరిపాలన శాఖ (జెనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్) స్పష్టం చేసింది.
- By Latha Suma Published Date - 04:13 PM, Wed - 11 June 25

APPSC : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఎస్సీ వర్గీకరణ విధానానికి సంబంధించి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) తాజాగా కీలక ప్రకటన చేసింది. ఎస్సీ, ఎస్టీ వర్గాలను మూడు కేటగిరీలుగా విభజిస్తూ ప్రభుత్వం ఇటీవల జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3గా ఈ రెండు వర్గాలను విభజించి, ఈ కొత్త వర్గీకరణ ఏప్రిల్ 19, 2025 నుంచి అధికారికంగా అమలులోకి వస్తుందని సాధారణ పరిపాలన శాఖ (జెనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్) స్పష్టం చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో, ఇప్పటికే వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ (OTP) చేసుకున్న షెడ్యూల్డ్ కులాల అభ్యర్థులు తాము ఏ గ్రూపుకు (గ్రూప్ 1, 2 లేదా 3) చెందుతారో తెలుసుకుని, తగిన మార్పులు చేసుకోవాలని ఏపీపీఎస్సీ సూచించింది.
Read Also: Heavy rains : ఏపీలో నేడు, రేపు భారీ వర్షాలు
అభ్యర్థులు తమ ప్రొఫైల్‌లో కులం వర్గీకరణ వివరాలను సరిచూడకపోతే, త్వరలో విడుదలయ్యే ఉద్యోగ నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయని హెచ్చరించింది. వీటి కోసం అధికారిక వెబ్‌సైట్‌లో అభ్యర్థులు తమ ఓటీపీ వివరాలను నవీకరించాలి. ఇప్పటికే ఓటీపీ పూర్తి చేసుకున్న అభ్యర్థులు తమ వర్గీకరణ సమీక్షించుకుని, అవసరమైతే మార్పులు చేయాలి. కొత్త అభ్యర్థులు వెబ్‌సైట్‌లోకి వెళ్లి వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని ఏపీపీఎస్సీ వెబ్ నోటిఫికేషన్ ద్వారా తెలిపింది. ఈ వర్గీకరణ ప్రభావం ముఖ్యంగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రక్రియలపై పడనుంది. ఉద్యోగ నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసే సమయానికి అభ్యర్థి యొక్క కులం సంబంధిత గ్రూప్ వివరాలు ఓటీపీలో ఖచ్చితంగా ఉండాలని ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. లేకపోతే దరఖాస్తు తిరస్కరించబడే అవకాశముందని హెచ్చరించింది.
అభ్యర్థులు ఈ విషయాన్ని తేలికగా తీసుకోకుండా, తమ ప్రొఫైల్ వివరాలను సమగ్రంగా పరిశీలించి, మార్చాల్సిన అవసరం ఉంటే వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ చర్యలు ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ప్రభుత్వం కల్పించే న్యాయం, ప్రాధాన్యతలను సమర్థంగా అమలు చేయడంలో కీలకంగా ఉంటాయని ఏపీపీఎస్సీ పేర్కొంది. అంతేకాకుండా, కొత్త వర్గీకరణకు అనుగుణంగా విధివిధానాల్లో మార్పులు వచ్చే అవకాశం ఉండడంతో అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను తరచూ సందర్శిస్తూ, తాజా సమాచారం తెలుసుకోవాలని సూచన జారీ చేసింది.
Read Also: Congress : దిగ్విజయ్ సింగ్ సోదరుడు లక్ష్మణ్‌పై బహిష్కరణ వేటు