Partition Promises : ప్రత్యేక ‘తెలంగాణ’కు పదేళ్లు.. అటకెక్కిన విభజన హామీలు
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి రేపటికి (జూన్ 2 నాటికి) సరిగ్గా పదేళ్లు.
- By Pasha Published Date - 08:50 AM, Sat - 1 June 24

Partition Promises : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి రేపటికి (జూన్ 2 నాటికి) సరిగ్గా పదేళ్లు. ఈనేపథ్యంలో విభజన హామీలపై ప్రధాన చర్చ జరుగుతోంది. రాష్ట్రం ఏర్పడి పదేళ్లు గడిచినా.. కేంద్రంలోని బీజేపీ సర్కారు విభజన హామీలను నెరవేర్చే దిశగా అడుగులు వేయకపోవడంపై డిస్కషన్ నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 బిల్లులో తెలంగాణకు ఇచ్చిన హామీలను ఇప్పటికైనా సాధించాలనే పట్టుదలతో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. త్వరలో కేంద్రంలో ఏర్పడబోయే ప్రభుత్వంతో మాట్లాడి.. విభజన హామీలను అమలు చేయిస్తామని రేవంత్ సర్కారు చెబుతోంది.
We’re now on WhatsApp. Click to Join
నెరవేరిన ఒక్క హామీ
తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన విభజన హామీల్లో(Partition Promises) ఒక్కటే నెరవేరింది. ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలోని ములుగులో గిరిజన కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని కేంద్రం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ యూనివర్సిటీ కోసం 331 ఎకరాలను, తాత్కాలిక వసతి కోసం భవనాలను కేటాయించింది.
Also Read :Exit Polls 2024 : ఇవాళ సాయంత్రమే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు.. సర్వత్రా ఉత్కంఠ
నెరవేరని హామీల చిట్టా
- కృష్ణా బేసిన్‌లో సగం వాటా కావాలని తెలంగాణ డిమాండ్ చేస్తోంది. అయినా ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు.
- 2014-15 సంవత్సరంలో తెలంగాణకు రావాల్సిన సీఎస్‌ఎస్ నిధులు రూ.495 కోట్లను కేంద్రం పొరబాటున ఏపీకి బదలాయించింది. వాటిని వెనక్కి ఇప్పించాలని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు.
- తెలంగాణ పురోగతి కోసం ఖమ్మంలోని బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటును పరిశీలిస్తామని విభజన చట్టంలో కేంద్రం పేర్కొంది. పదేళ్లు గడచినా స్టీలు ఫ్యాక్టరీ ఏర్పాటులో ఇంతవరకు ఎలాంటి ముందడుగు పడలేదు.
- కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని పెడతామని కేంద్రం స్వయంగా విభజన చట్టంలో హామీ ఇచ్చింది. ఈ హామీని తొమ్మిదేళ్లు నానబెట్టి చివరికి రైల్వే వ్యాగన్ ఉత్పత్తికి కేంద్రం అంగీకరించింది. ఇటీవల ప్రధాని మోడీ కాజీపేటలో వ్యాగన్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు.
- తెలంగాణలో ఏదైనా ఒక సాగునీటిపారుదల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని విభజన చట్టంలో స్పష్టంగా ఉంది. ఈ మేరకు కాళేశ్వరం ప్రాజెక్టుకుగానీ, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకుగానీ జాతీయ హోదా ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం ఎన్నిసార్లు కోరినా కేంద్రం నుంచి ఫలితం లేదు.
- తెలంగాణలోని వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ఏటా రూ.450 కోట్లు ఇస్తామని విభజన చట్టంలో కేంద్రం హామీ ఇచ్చింది. ఇంకా 2014-15, 2019-20, 2021-22, 2022-23కు సంబంధించిన నిధులు తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సి ఉంది.