Bandi Sanjay: కేంద్ర మంత్రి బండి సంజయ్ తల్లికి తీవ్ర అస్వస్థత
- Author : Vamsi Chowdary Korata
Date : 16-05-2026 - 11:50 IST
Published By : Hashtagu Telugu Desk
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తల్లి శకుంతలమ్మ శుక్రవారం తీవ్ర గుండెపోటుకు గురయ్యారు. కరీంనగర్‌లోని నివాసంలో అస్వస్థతకు గురైన ఆమెను కుటుంబ సభ్యులు హుటాహుటిన హైదరాబాద్ తరలించారు. నానక్‌రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని ఒక ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి అత్యవసరంగా గుండెకు స్టెంట్ వేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న బండి సంజయ్ విషయం తెలిసిన వెంటనే ఆసుపత్రికి చేరుకొని వైద్యులను అడిగి తల్లి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ తల్లి బండి శకుంతలమ్మ (75) శుక్రవారం (మే 15) హఠాత్తుగా తీవ్ర గుండెపోటుకు గురయ్యారు. కరీంనగర్ చైతన్యపురిలోని తమ స్వగృహంలో ఉన్న సమయంలో ఆమెకు గుండెలో తీవ్రమైన నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే స్పందించారు. వయోభారం, ఆరోగ్య పరిస్థితి తీవ్రతను పరిగణనలోకి తీసుకుని స్థానిక వైద్యుల ప్రాథమిక సలహా మేరకు ఆమెను మెరుగైన వైద్యం కోసం హుటాహుటిన హైదరాబాద్‌కు తరలించారు.
శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లోని నానక్‌రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఉన్న ఒక ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రిలో శకుంతలమ్మను చేర్పించారు. అక్కడ అప్పటికే సిద్ధంగా ఉన్న గుండె వైద్య నిపుణుల బృందం ఆమెకు అత్యవసర పరీక్షలు నిర్వహించింది. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనులలో తీవ్రమైన బ్లాక్స్ ఉన్నట్లు గుర్తించిన వైద్యులు.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా అత్యవసరంగా యాంజియోప్లాస్టీ నిర్వహించి గుండెకు స్టెంట్ వేశారు. ప్రస్తుతం ఆమెను ఐసీయూలో ఉంచి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. శస్త్రచికిత్స విజయవంతమైందని, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం స్థిరంగా ఉందని డాక్టర్లు వెల్లడించారు.
ఈ సమాచారం తెలిసిన వెంటనే ఢిల్లీలో అధికారిక పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తన కార్యక్రమాలను రద్దు చేసుకుని అత్యవసరంగా హైదరాబాద్‌కు బయలుదేరి వచ్చారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి నేరుగా నానక్‌రాంగూడలోని ఆసుపత్రికి చేరుకున్న ఆయన.. ఐసీయూలో చికిత్స పొందుతున్న తన తల్లిని పరామర్శించారు. అనంతరం శకుంతలమ్మకు చికిత్స అందిస్తున్న కార్డియాలజిస్ట్ బృందంతో మాట్లాడి ఆమె ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని, అందించాల్సిన తదుపరి వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. తల్లి ఆరోగ్యంపై సంజయ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేయగా.. వైద్యులు ఆయనకు ధైర్యం చెప్పారు.
బండి సంజయ్‌కు ఊరట.. కోర్టు కీలక గ్యాగ్ ఆర్డర్
ఇదిలా ఉండగా.. బండి సంజయ్ కుమార్‌కు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో పెద్ద ఊరట లభించింది. తన కుమారుడు భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసును ఆసరాగా చేసుకొని తన ప్రతిష్టకు భంగం కలిగించేలా సోశల్ మీడియా, యూట్యూబ్, స్యాటెల్లైట్ చ్యానళ్లలో దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. బండి సంజయ్‌కు వ్యతిరేకంగా ఉన్న అభ్యంతరకర పోస్టులను, విడియోలను వెంటనే తొలగించాలించాలి ఆదేశిస్తూ కోర్టు కీలక గ్యాగ్ ఆర్డర్ జారీ చేసింది. వ్యక్తుల వ్యక్తిగత స్వేచ్ఛ, గౌరవానికి భంగం కలిగించేలా సాగే డిజిటల్ ట్రోలింగ్‌ను అడ్డుకోవాల్సిన ఆవశ్యం ఉందని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఒకవేళ కోర్టు ఇచ్చిన ఈ తాత్కాలిక స్టే ఉత్తర్వులను ఎవరైనా ధిక్కరిస్తే, చట్ట ప్రకారం కోర్టు ఉళ్లంఘన చర్యలతో పాటు ఐటీ ఏక్ట్ కింద తీవ్రమైన కఠిన చట్టపరమైన చర్యలు ఉంటాయి న్యాయమూర్తి హెచ్చరించారు.